వైట్ హౌస్ కు విషం పూసిన లేఖ... తీవ్ర కలకలం!

20-09-2020 Sun 10:15
Letter With Poison Ricin to White House
  • ట్రంప్ చిరునామాతో రిసిన్ పూసిన లెటర్
  • ముందుగానే గుర్తించిన అధికారులు
  • విచారణ ప్రారంభించామని వెల్లడి

గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అత్యంత ప్రమాదకరమైన రిసిన్ విషం పూసిన లేఖ ఒకటి డొనాల్డ్ ట్రంప్ పేరిట వాషింగ్టన్ లోని శ్వేతసౌధం చిరునామాతో రావడం తీవ్ర కలకలాన్ని రేపింది. దీన్ని ముందే గుర్తించిన అధికారులు, అది లక్ష్యాన్ని చేరకుండా ఆపేశారు. దీనిపై దర్యాఫ్తు చేస్తున్నామని వైట్ హౌస్ అధికారులు తెలిపారు. ఈ దర్యాఫ్తును ఎఫ్బీఐ, సీక్రెట్ సర్వీస్, యూఎస్ పోస్టల్ ఇనస్పెక్షన్ సర్వీస్ సంయుక్తంగా విచారించనున్నాయని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

కాగా, ఇది కెనడా నుంచి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ లేఖ వైట్ హౌస్ కు చేరకముందే, స్థానిక ప్రభుత్వ మెయిల్ సెంటర్ లోనే అధికారులు గుర్తించారని 'సీఎన్ఎన్', 'వాల్ స్ట్రీట్ జర్నల్' ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. మొత్తం వ్యవహారంపై స్పందించిన ఓ అధికారి, ప్రజలకు ఈ లేఖతో ఎటువంటి అపాయమూ కలుగదని, విచారణ జరుగుతోందని మాత్రమే వెల్లడించగా, వైట్ హౌస్, యూఎస్ సీక్రెట్ సర్వీస్ లు స్పందించేందుకు నిరాకరించాయి.

ఇదిలావుండగా, ఈ లేఖపై పూసిన రిసిన్, అత్యంత ప్రమాదకరమైన విషమే. దీన్ని జీవాయుధంగా కూడా వినియోగించవచ్చు. దీన్ని తీసుకున్న 36 నుంచి 72 గంటల్లోగా మరణం తప్పదని, ఈ విషానికి ఇంతవరకూ యాంటీ డోస్ కనుగొనబడలేదని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు వెల్లడించారు. యూఎస్ అధికార గణాంకాల ప్రకారం, రిసిన్ పూసిన లేఖలను అందుకున్న ఎంతో మంది అమెరికన్లకు మరణాలు సంభవించాయి.