రష్యా టీకా మూడో దశ ట్రయల్స్‌లో మళ్లీ అపశ్రుతి

20-09-2020 Sun 09:27
Inconsistency again over Russia vaccine third phase trials
  • తుది దశలో 40 వేల మందికి టీకా ఇవ్వాలని నిర్ణయం
  • ప్రతి ఏడుగురిలో ఒకరిలో కండరాల నొప్పి, జ్వరం, నీరసం వంటి లక్షణాలు
  • 36 గంటల తర్వాత తగ్గిపోతాయన్న మంత్రి

రష్యా తీసుకొచ్చిన కరోనా టీకా ‘స్పుత్నిక్ వి’ పరీక్షల్లో మరోమారు అపశ్రుతి చోటుచేసుకుంది. పరీక్షల్లో భాగంగా ఇటీవల ఓ వలంటీర్ అస్వస్థతకు గురికాగా, మూడోదశ పరీక్షల్లోనూ అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్ మురష్కో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. వ్యాక్సిన్‌కు జరుగుతున్న తుది పరీక్షల్లో భాగంగా మొత్తం 40 వేల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.

ఇప్పటి వరకు 300 మందికి టీకా వేసినట్టు చెప్పారు. అయితే, టీకా తీసుకున్న ప్రతి ఏడుగురు వలంటీర్లలో ఒకరిలో కండరాల నొప్పి, జ్వరం, నీరసం, శరీర ఉష్ణోగ్రత పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తున్నట్టు చెప్పారు. అయితే, భయపడాల్సింది ఏమీ లేదని, ఒక రోజు, లేదంటే 36 గంటల తర్వాత ఈ లక్షణాలన్నీ పూర్తిగా తొలగిపోతాయని మంత్రి వివరించారు.