2021 ఐపీఎల్ కూడా దుబాయ్ లోనే!

20-09-2020 Sun 09:05
Next IPl is Also in Dubai
  • నిరాడంబరంగా మొదలైన ఐపీఎల్
  • యూఏఈ బోర్డుతో బీసీసీఐ ఎంఓయూ
  • ఇంగ్లండ్ తో సిరీస్ కూడా దుబాయ్ లో జరిగే అవకాశం!

13వ సీజన్ ఐపీఎల్ పోటీలు యూఏఈలో నిరాడంబరంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక, మరో 9 నెలల్లో జరగాల్సిన 2021 పోటీలను కూడా ఇక్కడే జరపాలని బీసీసీఐ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకూ కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వచ్చే ఏడాది ఐపీఎల్ కూడా యూఏఈలో నిర్వహిస్తే, రెండు దేశాల మధ్యా క్రికెట్ సంబంధాలు మరింత మెరుగు పడతాయని భావించిన ఉన్నతాధికారులు, ఈ మేరకు యూఏఈ క్రికెట్ బోర్డుతో ఓ ప్రత్యేక అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఈ విషయాన్ని వెల్లడించిన బోర్డు కార్యదర్శి జై షా, ఈ సమావేశంలో యూఏఈ క్రికెట్ అధికారులతో పాటు సౌరవ్ గంగూలీ, ట్రెజరర్ అరుణ్ ధమాల్ తదితరులు పాల్గొన్నారని తెలిపారు. ఇక ఈ సంవత్సరం చివరిలో ఇండియాలో జరగాల్సిన ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ ను సైతం యూఏఈలో జరిపించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.