బైక్ ఢీకొట్టడం వల్లే రచయిత దానం శివప్రసాద్ మృతి.. సీసీటీవీ ఫుటేజీలో వెలుగుచూసిన నిజం!

20-09-2020 Sun 08:54
writer Danam Sivaprasad died due to accident not with heart attack
  • ఈ నెల 12న రోడ్డుపై కుప్పకూలిన శివప్రసాద్
  • గుండెపోటు కారణంగా మృతి చెంది ఉంటారని భావించిన కుటుంబ సభ్యులు
  • అనుమానంతో ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి

మాచర్లకు చెందిన ప్రముఖ రచయిత, విశ్రాంత ఉపాధ్యాయుడు దానం శివప్రసాద్ (65) గుండెపోటుతో మరణించలేదని, ఓ బైక్ ఢీకొట్టడంతోనే ఆయన మృతి చెందినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. వ్యాయామం కోసం ఈ నెల 12న ఉదయం బయటకు వెళ్లిన శివప్రసాద్ రోడ్డుపక్కన పడి ఉండడంతో గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు గుంటూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందారు. గుండెపోటు కారణంగానే ఆయన చనిపోయి ఉంటారని భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు.

అయితే, ఆ తర్వాత వారిలో అనుమానం మొదలైంది. ఆరోగ్యంగా, ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే ఆయన హఠాత్తుగా కుప్పకూలి మరణించడాన్ని నమ్మలేకపోయారు. దీంతో ఆరాతీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆయన వాకింగ్‌కు వెళ్లి వస్తున్న దారిలో ఉన్న పెట్రోలు బంకులోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా అసలు విషయం తెలిసి షాకయ్యారు.

వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ బైక్ శివప్రసాద్‌ను ఢీకొట్టడంతో ఆయన కుప్పకూలారు. బైక్‌పై ఉన్న వ్యక్తి కూడా కిందపడ్డాడు. అయితే, ఆ వెంటనే అతడు బైక్ తీసుకుని పరారయ్యాడు. ఇంత ప్రమాదం జరిగినా చుట్టుపక్కల వారు ఎవరూ స్పందించకపోవడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంపై మాచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.