Secunderabad: కరోనాను ఖాతరు చేయని జనాలు.. అప్పుడే నిండిపోయిన సంక్రాంతి రైళ్లు!

  • విజయవాడ మీదుగా రాకపోలు సాగించే రైళ్లన్నీ ఫుల్
  • విశాఖ, విజయనగరం మార్గాల్లో నడిచే రైళ్లలో వెయిటింగ్ లిస్టులు
  • అదనపు రైళ్లు నడపాలని ప్రయాణికుల డిమాండ్
No corona all trains are full ahead of sankranti

కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ దానిపై ప్రజల్లో ఉన్న భయాందోళనలు మాత్రం క్రమంగా తగ్గుతున్నాయి. ప్రజలు క్రమంగా సాధారణ జీవితానికి అలవాటు పడుతున్న వేళ.. పండుగ ప్రయాణాలకు కూడా వెనకాడడం లేదు. సంక్రాంతి పండుగకు ఊరెళ్లే వారితో రైళ్లన్నీ ఇప్పటికే నిండిపోవడాన్ని చూస్తుంటే కరోనాను ప్రజలు ఏమాత్రం లెక్కచేయడం లేదని అర్థమవుతోంది. విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే రైళ్ల రిజర్వేషన్ బుకింగ్ ప్రారంభమైన నిమిషాల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అంతేకాదు, వెయిటింగ్ లిస్టులు కూడా భారీగానే పెరగడం గమనార్హం.

విశాఖపట్టణం, విజయనగరం మార్గాల్లో నడిచే రైళ్లలో వెయిటింగ్ లిస్టులు భారీగా పెరిగిపోయాయి. సికింద్రాబాద్ వైపు కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ప్రయాణ తేదీకి నాలుగు నెలల ముందే టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండడంతో ప్రయాణికులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా బుకింగ్‌లు చేసుకుంటున్నారు.  తీరిగ్గా వెళ్లే వారికి నిరాశ తప్పడం లేదు.

సికింద్రాబాద్, హైదరాబాద్‌లలోని అన్ని రిజర్వేషన్ కేంద్రాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. టికెట్లు దక్కని వారు తత్కాల్ టికెట్లపై ఆశలు పెట్టుకుని వెనుదిరుగుతున్నారు. పండుగ రద్దీ నేపథ్యంలో హౌరా, సికింద్రాబాద్, బెంగళూరు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News