తొమ్మిదేళ్ల నాటి సినిమా వివాదం.. 28న హాజరు కావాలంటూ నటుడు ఆర్యకు కోర్టు నోటీసులు!

20-09-2020 Sun 07:16
Amba Samudram court issues notice to actor Aarya
  • 9 ఏళ్ల క్రితం వచ్చిన ‘అవన్ ఇవన్’
  • హిందూ దేవుళ్లు, సింగంపట్టి జమీందార్‌లను కించపరిచే సన్నివేశాలు
  • తాజాగా పిటిషన్‌ను విచారించిన కోర్టు

తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు ఆర్యకు అంబా సముద్రం కోర్టు నోటీసులు జారీ చేసింది. 9 ఏళ్ల క్రితం ఆర్య నటించిన సినిమా ‘అవన్ ఇవన్’ వివాదాస్పదమైంది. ఇందులో సింగంపట్టి జమీన్‌ను అవమానపరిచే సన్నివేశాలు ఉన్నాయంటూ తిరునెల్వేలి అంబా సముద్రం కోర్టులో అప్పట్లో పిటిషన్ దాఖలు కాగా, తాజాగా ఇది విచారణకు వచ్చింది.

సినిమాలో హిందూ దేవుళ్లు, సోరిముత్తు అయ్యనార్, సింగంపట్టి జమిందార్‌లను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ దర్శకుడు బాల, ఆర్యలపై పిటిషనర్ అప్పట్లో కోర్టుకెక్కాడు. శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈ నెల 28న తమ ఎదుట హాజరు కావాలంటూ ఆర్యకు నోటీసులు జారీ చేసింది.

అవన్ ఇవన్ సినిమాకు బాల దర్శకత్వం వహించగా, విశాల్, ఆర్య ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా, ఈ కేసును కొట్టివేయాలంటూ 2018లో మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్‌ను ఆర్య ఆశ్రయించాడు.