Maoists: ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోల మృతి

  • కదంబా అటవీ ప్రాంతంలో ఘటన
  • మరో ఇద్దరు కూడా మృతి చెంది ఉండొచ్చని అనుమానం
  • తప్పించుకున్న భాస్కర్
Two Maoists dead in an Encounter in Adilabad dist

తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాలో గత రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. కుమురం భీం, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని కదంబా అటవీ ప్రాంతంలో రాత్రి 9 గంటల సమయంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

చనిపోయిన మావోయిస్టుల్లో ఓ మహిళ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. జోరున వర్షం కురుస్తుండడంతో మృతదేహాల గుర్తింపు కష్టంగా మారింది. అయితే, చనిపోయిన వారిలో మరొకరు వర్గీస్ ఉన్నట్టు సమాచారం. ఆయన ఇటీవలే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ఏరియా కమిటీ సారథిగా నియమితులయ్యారు. చత్తీస్‌గఢ్‌కు చెందిన వర్గీస్‌పై రూ.5 లక్షల రూపాయల రివార్డు ఉంది.

ఈ ఎన్‌కౌంటర్‌లో మరో ఇద్దరు కూడా మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ తప్పించుకున్నట్టు సమాచారం. రెండున్నర దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న భాస్కర్ తలపై రూ. 20 లక్షల రివార్డు ఉంది. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి ఏకే 47ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఆపరేషన్‌లో మొత్తం ఎనిమిది గ్రేహౌండ్స్ బృందాలు, ఆరు స్పెషల్ పార్టీలు పాల్గొన్నాయి. గాలింపు ఇంకా కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్ విషయం తెలిసిన వెంటనే కుమురంభీం జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ, రామగుండం పోలీసు కమిషనర్ వి.సత్యనారాయణ, ఏఎస్పీ సుధీంద్ర ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

More Telugu News