దిశ ఆత్మహత్యకు ముందు మాకు ఫోన్ చేసిందనడంలో వాస్తవం లేదు: ముంబయి పోలీసులు

19-09-2020 Sat 21:40
Mumbai police clarifies what happened before Disha Salian death
  • సుశాంత్ మరణానికి ముందు దిశ సలియాన్ ఆత్మహత్య
  • అత్యాచారం చేశారంటూ ప్రచారం
  • దిశ మృతికి ముందు స్నేహితురాలికి ఫోన్ చేసిందన్న పోలీసులు

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి కొద్దిరోజుల ముందు మాజీ మేనేజర్ దిశా సలియాన్ మృతి చెందింది. అయితే, దిశ సలియాన్ ఆత్మహత్య చేసుకోలేదని, కొందరు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి బిల్డింగ్ పైనుంచి తోసేశారని ప్రచారం జరిగింది. దిశ మరణానికి ముందు 100 నెంబర్ కు ఫోన్ చేసిందని కూడా ఆరోపణలు వచ్చాయి. వీటిపై ముంబయి పోలీసులు వివరణ ఇచ్చారు.

తన మృతికి ముందు దిశ సలియాన్ తన స్నేహితురాలు అంకితకు ఫోన్ చేశారని పోలీసులు వెల్లడించారు. అంతేతప్ప, దిశ 100 నెంబర్ కు డయల్ చేసిందనడంలో వాస్తవంలేదని స్పష్టం చేశారు. ఇవన్నీ నిరాధారమైన కథనాలు మాత్రమేనని తెలిపారు.

కాగా, సుశాంత్ సన్నిహితుడు, జిమ్ పార్ట్ నర్ సునీల్ శుక్లా... దిశా సలియాన్ వ్యవహారంలో ఆమె కాబోయే భర్త రోహన్ రాయ్ పాత్రపై ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ రోహన్ రాయ్ ఎక్కడ? అంటూ సునీల్ శుక్లా సందేహం వెలిబుచ్చారు. జూన్ 8న రోహన్ రాయ్ కు చెందిన మలాద్ అపార్ట్ మెంట్ లో పార్టీ జరిగిందని, ఆ పార్టీలో పాల్గొన్న కొందరు ఇప్పుడు ఎందుకు అజ్ఞాతంలో ఉన్నారని నిలదీశారు. దీప్ అజ్మీరా, ఇంద్రనీల్ వైద్య, హిమాంశు.. వీళ్లందరూ దిశా సలియాన్ కు మిత్రులని, వీళ్లందరూ పార్టీ తర్వాత కనిపించడంలేదని అన్నారు.