ఈ సూపర్ బైక్ ఖరీదు రూ.18.9 లక్షలు

19-09-2020 Sat 21:20
BMW launches cruiser bike in Indian market
  • బీఎండబ్ల్యూ నుంచి కొత్త బైక్ ఆర్18
  • క్రూయిజర్ సెగ్మెంట్లో అడుగుపెట్టిన బీఎండబ్ల్యూ
  • భారత విపణిలోకి సరికొత్త క్రూయిజర్ బైక్

జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ విలాసవంతమైన కార్లనే కాదు, హైఎండ్ ప్రీమియం బైక్ ల తయారీలోనూ పేరుగాంచింది. తాజాగా బీఎండబ్ల్యూ ఆర్18 పేరిట ఓ సూపర్ బైక్ ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది.

ఈ బీఎండబ్ల్యూ ఆర్18 క్రూయిజర్ విభాగంలో లీడర్ గా కొనసాగుతున్న హార్లే డేవిడ్సన్ కు పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. అంతేకాదు, ప్రస్తుతం భారత మార్కెట్లో ఉన్న ట్రయంఫ్ రాకెట్ 3జీటీ, డుకాటీ డియావెల్ 1260 బైక్ లకు కూడా ఇది పోటీ అని ఆటోమొబైల్ నిపుణుల మాట.

ఇప్పటివరకు స్పోర్ట్స్ బైక్ లతో యువత మనసు దోచిన బీఎండబ్ల్యూ తన లేటెస్ట్ మోడల్ తో క్రూయిజర్ శ్రేణిలో అడుగుపెట్టింది. దీనిలో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఒకటి స్టాండర్డ్ వేరియంట్ కాగా, మరొకటి ఫస్ట్ ఎడిషన్ స్పెషల్ బైక్.

స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.18.9 లక్షలు కాగా, ఫస్ట్ ఎడిషన్ ధర రూ.21.9 లక్షలు. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఈ క్రూయిజర్ బైక్ ప్రత్యేకత ఏంటంటే, ఇందులో రివర్స్ గేర్ కూడా ఉంటుంది. ఈ 1802 సీసీ బైక్ లో మొత్తం 6 గేర్లు ఉన్నాయి.