చైనాకు రహస్యాల చేరవేత... భారత జర్నలిస్టు అరెస్ట్

19-09-2020 Sat 20:28
Delhi police arrests freelance journalist Rajiv Sharma
  • రాజీవ్ శర్మ అనే పాత్రికేయుడ్ని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు
  • షెల్ కంపెనీల ద్వారా రాజీవ్ శర్మకు నగదు చెల్లింపులు
  • ఓ మహిళను, నేపాలీ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఢిల్లీ పోలీసులు రాజీవ్ శర్మ అనే ఫ్రీలాన్స్ జర్నలిస్టును గూఢచర్యం ఆరోపణలపై ఇటీవల అరెస్ట్ చేశారు. రాజీవ్ శర్మ పాత్రికేయుడి ముసుగులో చైనా గూఢచారిగా వ్యవహరిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. భారత రహస్యాలను చైనాకు చేరవేస్తున్న రాజీవ్ శర్మ అందుకు ప్రతిఫలంగా భారీ మొత్తంలో డబ్బు పొందుతున్నట్టు భావిస్తున్నారు. షెల్ కంపెనీల ద్వారా అతడికి నగదు చెల్లింపులు జరుగుతున్నట్టు గుర్తించారు. రాజీవ్ శర్మకు చెల్లింపులు చేస్తున్న ఓ మహిళను, నేపాలీ వ్యక్తిని కూడా ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాజీవ్ శర్మను కోర్టులో హాజరుపర్చగా అతడికి 6 రోజుల పోలీస్ కస్టడీ విధించారు. కాగా నిందితుల నుంచి ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లు, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు ఢిల్లీ స్పెషల్ సెల్ డీసీపీ సంజీవ్ కుమార్ వెల్లడించారు. వ్యూహాత్మక వ్యవహారాల విశ్లేషకుడిగా పాత్రికేయ రంగంలో రాజీవ్ శర్మకు గుర్తింపు ఉంది. అయితే అతను రక్షణ రంగానికి చెందిన కీలక పత్రాలు కలిగివున్నాడన్న ఆరోపణలపై అరెస్ట్ చేశారు.

గతంలో యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా, ద ట్రిబ్యూన్, సకాల్ టైమ్స్ పత్రికల్లో పనిచేసిన రాజీవ్ శర్మ ఇటీవలే చైనా దినపత్రిక గ్లోబల్ టైమ్స్ కు కూడా ఓ వ్యాసం రాయడం గమనార్హం. రాజీవ్ శర్మను సెప్టెంబరు 14న అరెస్ట్ చేశామని, ఆ మరుసటి రోజు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామని డీసీపీ వెల్లడించారు.