సోనియాగాంధీ, వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా డిక్లరేషన్ పై సంతకం చేయలేదు: వైవీ సుబ్బారెడ్డి

19-09-2020 Sat 20:02
Sonia and YSR also didnt signed TTD declaration says YV Subba Reddy
  • హిందూయేతరులు సంతకం చేయాలనేది చట్టంలో ఉంది
  • జగన్ కూడా గతలో సంతకం చేయలేదు
  • నా మాటలను వక్రీకరించవద్దు

తిరుమల శ్రీవారిని దర్శించుకునే అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. టీటీడీ నిబంధనల ప్రకారం శ్రీవారిపై తమకు నమ్మకం ఉందని అన్యమతస్థులు డిక్లరేషన్ పై సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వైవీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన వ్యాఖ్యలను హిందూ సంఘాలు, విపక్షాలు తప్పుబడుతున్నాయి. కేవలం ఒక వ్యక్తి కోసం టీటీడీ నిబంధనలనే మారుస్తారా? అని చంద్రబాబు మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి మరోసారి స్పందించారు. గతంలో శ్రీవారిని దర్శించుకున్న సమయంలో సోనియాగాంధీ, వైయస్ రాజశేఖరరెడ్డి డిక్లరేషన్ లో సంతకం చేయలేదని ఆయన తెలిపారు. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఈనెల 23న స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించే సమయంలో సీఎం జగన్ కూడా డిక్లరేషన్ పై సంతకం చెయ్యరని అన్నానని చెప్పారు. హిందూయేతరులు ఎవరు వచ్చినా డిక్లరేషన్ పై సంతకం చేయాలని చట్టంలో ఉందని తెలిపారు.

సర్వదర్శనం ద్వారా స్వామిని దర్శించుకుంటున్న హిందూయేతరులు డిక్లరేషన్ పై సంతకం చేయడం లేదని వైవీ చెప్పారు. గుర్తించిన వారి నుంచే డిక్లరేషన్ తీసుకున్నామని తెలిపారు. జగన్ గతంలో స్వామిని ఎప్పుడు దర్శించుకున్నా డిక్లరేషన్ సమర్పించలేదని చెప్పారు. తన మాటలను వక్రీకరించవద్దని ఆయన కోరారు.