బండి సంజయ్ మాట్లాడే ప్రతి మాట అబద్ధాల మూట: ఎర్రబెల్లి

19-09-2020 Sat 19:41
Telangana minister Errabelli comments on BJP Chief Bandi Sanjay
  • వర్థన్నపేటలో ఎర్రబెల్లి వ్యాఖ్యలు
  • డప్పు కొట్టుకుంటున్నారంటూ బీజేపీపై విమర్శలు
  • బీజేపీ, కాంగ్రెస్ లకు బుద్ధి చెప్పాలని పిలుపు

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై విమర్శలు చేశారు. బండి సంజయ్ మాట్లాడే ప్రతి మాట అబద్ధాల మూట అని అన్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చే నిధులు తక్కువే అయినా, ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ వాళ్లు కొట్టుకునే డప్పు ఎక్కువని విమర్శించారు. ప్రతి నెల వృద్ధుల కోసం ఇచ్చే ఆసరా పెన్షన్లకే తమ సర్కారు రూ.11 వేల కోట్లు ఇస్తుంటే, కేంద్రం కేటాయించేది రూ.200 కోట్లు మాత్రమేనని తెలిపారు.

సీఎం కేసీఆర్ ఎంతో దూరదృష్టితో ఆలోచిస్తూ అనేక పథకాలు తీసుకువస్తే, అవన్నీ కేంద్రం ఇచ్చే నిధులతో నడుస్తున్నాయని ప్రచారం చేస్తుండడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. అబద్ధాలు చెబుతూ పబ్బం గడుపుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ఎర్రబెల్లి టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలను టీఆర్ఎస్ యువజన విభాగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. వర్థన్నపేట నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఎర్రబెల్లి ఈ వ్యాఖ్యలు చేశారు.