ఉపాధి లేక భిక్షాటన చేస్తున్న భారతీయులు... అరెస్ట్ చేసిన సౌదీ పోలీసులు

19-09-2020 Sat 18:50
Indian labor begging in Saudi Arabia due to corona situations
  • కరోనా నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన భారతీయులు
  • సౌదీలో యాచక వృత్తిపై నిషేధం
  • నిర్బంధ కేంద్రాల్లో మగ్గిపోతున్న భారత కార్మికులు

కరోనా మహమ్మారి పుణ్యమా అని సౌదీ అరేబియాలో వందలాది మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయారు. వారి వర్క్ పర్మిట్లు కూడా కాలం చెల్లడంతో ఉపాధి లేక భిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సౌదీలో యాచక వృత్తిపై నిషేధం ఉండడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి నిర్బంధ గృహానికి తరలించారు.

జెడ్డాలోని షుమైసీ నిర్బంధ కేంద్రంలో దాదాపు 450 మంది భారతీయులు అగచాట్లు పడుతున్నారు. వీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, కశ్మీర్, ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలకు చెందినవారు. వీరిలో ఒకరు  రికార్డు చేసిన వీడియో వైరల్ అవుతోంది.

గత నాలుగు నెలలుగా సౌదీలో అష్టకష్టాలు పడుతున్నామని, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, శ్రీలంక దేశాలకు చెందిన కార్మికులు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటే వారికి ఆయా దేశాల ప్రభుత్వాలు సహకరించి స్వస్థలాలకు తరలించాయని తెలిపారు. కానీ తాము మాత్రం ఎలాంటి సాయం అందకపోవడంతో ఇక్కడ చిక్కుకుపోయాయని వారు వాపోయారు. తమను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.