ఇది యావత్ భారతదేశంలో అన్యమతస్థులకి వర్తించే అంశం: సోము వీర్రాజు

19-09-2020 Sat 15:18
Somu Verraju says BJP condemns YV Subbareddy statement on Tirumala Declaration
  • మరోసారి వివాదాస్పదమైన తిరుమల డిక్లరేషన్ అంశం
  • అన్యమతస్థులకు డిక్లరేషన్ అవసరం లేదన్న వైవీ
  • వైవీ వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తోందన్న సోము వీర్రాజు

తిరుమల క్షేత్రంలో శ్రీవారి దర్శనానికి వచ్చే అన్యమతస్థులు ఇకపై డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదు అంటూ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటనపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. టీటీడీ బోర్డు చైర్మన్ వెలువరించిన అంశాన్ని బీజేపీ ఖండిస్తోందని తెలిపారు. స్వర్గీయ అబ్దుల్ కలాం అంతటి వ్యక్తి తిరుమల వచ్చినప్పుడు అక్కడున్న రిజిస్టర్ లో సంతకం పెట్టి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం జరిగిందని వివరించారు.

ఇది యావత్ భారతదేశంలో అన్యమతస్థులకు వర్తించే అంశమని, దీన్ని గమనించి ప్రకటన చేయాల్సిన సమయంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివాదాస్పద రీతిలో ప్రస్తావించడం ఆయన అనాలోచిత వైఖరికి నిదర్శనం అని సోము వీర్రాజు పేర్కొన్నారు. అన్యమతస్థులు ప్రత్యేకంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరంలేదని, వారు స్వామివారి పట్ల భక్తి విశ్వాసాలతో దర్శనం చేసుకోవచ్చని వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.