ఐపీఎల్ ఆరంభ పోరు నేడే... ముంబయి వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్

19-09-2020 Sat 13:33
IPL starts today as Mumbai Indians set to face Chennai Super Kings in the opener
  • నేటి నుంచి ఐపీఎల్ 13వ సీజన్ షురూ
  • యూఏఈ వేదికగా ఐపీఎల్
  • కరోనా కారణంగా భారత్ నుంచి తరలివెళ్లిన ఐపీఎల్

ఐపీఎల్ 13వ సీజన్ నేడు ప్రారంభం కానుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్ ఆతిథ్యం యూఏఈకి దక్కిన క్రమంలో ఆరంభ మ్యాచ్ లో ఈ సాయంత్రం డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్ తో పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ కు అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియం వేదికగా నిలవనుంది.

ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 28 పర్యాయాలు తలపడ్డాయి. అయితే ముంబయి జట్టుదే పైచేయిగా ఉంది. ముంబయి 17 విజయాలు అందుకోగా,  సూపర్ కింగ్స్ 11 విజయాలు సాధించింది. ఓవరాల్ గా రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబయి ఇండియన్స్ 4 సార్లు టైటిల్ నెగ్గగా, ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మూడు సార్లు విజేతగా నిలిచింది. రెండు జట్లలోనూ ఆల్ రౌండర్లు పుష్కలంగా ఉండడంతో ఎప్పుడు తలపడినా హోరాహోరీ పోరు ఖాయం.

ఇక, ఈ ఆరంభ పోరుకు ఆతిథ్యమిస్తున్న షేక్ జయేద్ స్టేడియం పిచ్ పై గతంలో భారీ స్కోర్లు నమోదైన సందర్భాలు చాలా తక్కువ. ఇక్కడ మందకొడిగా ఉండే పిచ్ పై పవర్ హిట్టింగ్ చేద్దామంటే కుదరదు. సహనంతో బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు రాణించే అవకాశాలు ఉన్నాయి. పైగా పెద్ద మైదానం కావడంతో సిక్సర్లు కొట్టాలంటే బ్యాట్స్ మెన్ కు కాస్తంత అదనపు శ్రమ తప్పదు.