ముంబైలోని ఇంట్లోనే షూటింగ్.. ఉత్సాహం వచ్చేసిందన్న తమన్నా!

19-09-2020 Sat 10:25
Thamanna joined shoot at her home in Mumbai
  • లాక్ డౌన్ తో బోర్ ఫీలవుతున్న తారలు
  • నిన్న షూట్ లో పాల్గొన్న తమన్నా
  • ఇంటినే సెట్ గా మార్చేశామన్న తమ్మూ 
  • షూటింగ్ దేనికన్నది చెప్పని ముద్దుగుమ్మ 

చేతినిండా సినిమాలు వుండే బిజీ తారలు సెలవు కోసం మొహం వాచిపోతూవుంటారు. ఒక్క నాలుగు రోజులు ఖాళీ దొరికితే బాగుండును అని ఆశపడుతుంటారు. అయితే, లాక్ డౌన్ రూపంలో వారికి ఆ అవకాశం దక్కింది. దీంతో మొదట్లో పది, పదిహేను రోజులు బాగానే ఎంజాయ్ చేసిన తారలు, ఇక ఆ తర్వాత ఊరికే ఖాళీగా వుండడాన్ని భరించలేక ఎప్పుడు షూటింగులు మొదలవుతాయా? అంటూ అసహనంతో ఎదురుచూస్తూ కూర్చున్నారు.

ఈ క్రమంలో మిల్కీ బ్యూటీ తమన్నా చాలా రోజుల తర్వాత నిన్న కెమేరా ముందుకు వచ్చి, ఎంతో మురిసిపోయింది. కెమేరా ముందుకు వెళ్లగానే ఒక్కసారిగా పాత రోజులు జ్ఞప్తికి వచ్చి ఎంతో థ్రిల్ అయింది. పైగా ఈ ముద్దుగుమ్మ షూటింగ్ చేసింది కూడా ఎక్కడో స్టూడియోలో కాదు.. ముంబైలోని తన ఇంట్లోనే కావడం మరో విశేషం.

ఈ విషయాన్ని తమన్నా సోషల్ మీడియాలో పంచుకుంటూ, 'ఓ షూట్ కోసం మా ఇల్లునే సెట్ గా మార్చేశాం. కెమేరా ముందుకు వెళ్లగానే ఒక్కసారిగా ఎంతో ఉత్సాహం వచ్చేసింది..' అంటూ పేర్కొంది. అన్ని జాగ్రత్తలూ తీసుకుని షూటింగ్ చేశామని తమ్మూ చెప్పింది. అయితే, అది ఏదైనా సినిమా షూటింగా? లేక యాడ్ ఫిలిం షూటింగా? అన్నది అమ్మడు వెల్లడించలేదు.