దేశంలో ఉగ్రదాడుల కుట్ర భగ్నం... 9 మంది అల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్

19-09-2020 Sat 10:20
  • కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో ఈ తెల్లవారుజామున అరెస్ట్
  • సామాన్యులే లక్ష్యంగా దాడులకు ప్రణాళిక
  • అమాయకులను ఉగ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నం
9 Al Qaeda Terrorists Arrested In Kerala and Bengal

దేశంలో ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్న 9 మంది అల్‌ఖైదా ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈ  తెల్లవారుజామున అరెస్ట్ చేసింది. ఉగ్రవాదులకు సంబంధించి పక్కా సమాచారం అందుకున్న ఎన్ఐఏ కేరళలోని ఎర్నాకుళం, పశ్చిమ బెంగాల్‌లోని ముషీరాబాద్‌లలో దాడులు నిర్వహించి వీరిని అరెస్ట్ చేసింది. పశ్చిమ బెంగాల్, కేరళలోని వివిధ ప్రాంతాల్లో సామాన్యులను టార్గెట్ చేసుకున్న ఈ ముఠా భారీ పేలుళ్లకు పన్నాగం పన్నినట్టు తెలిసిందని ఎన్ఐఏ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

దాడులకు కుట్రలు పన్నడమే కాకుండా అమాయకులను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు వీరు ప్రయత్నిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వారిలో ముర్షీద్ హసన్, యాకూబ్ బిశ్వాస్, ముషారఫ్ హుస్సేన్‌లను కేరళలో, షకీబ్, అబు సోఫియాన్, మెయినల్ మోండల్, యీన్ అహ్మద్, మనుమ్ కమల్, రెహ్మాన్‌లను బెంగాల్‌లోని ముషీరాబాద్‌లో అరెస్ట్ చేసినట్టు వివరించారు.