కాస్తంత త్వరగా వ్యాక్సిన్ ఇవ్వండి: రష్యాను కోరిన ఇండియా

19-09-2020 Sat 08:57
Govt in talks with Russia for Sputnik V in India
  • ఇప్పటికే రష్యాను కోరామని లోక్ సభకు చెప్పిన కేంద్రం
  • రష్యాతో బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయన్న ఆరోగ్య శాఖ
  • ఇప్పటికే డీల్ కుదుర్చుకున్న డాక్టర్ రెడ్డీస్

కరోనా నివారణకు రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ ను సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని కోరినట్టు కేంద్రం లోక్ సభకు తెలియజేసింది. రష్యా తయారు చేసిన 'స్పుత్నిక్ వీ' వ్యాక్సిన్ తయారీ దిశగా ఇప్పటికే డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఇరు దేశాల మధ్యా ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాల దృష్ట్యా, టీకాను త్వరగా తెప్పించేందుకు కృషిచేస్తున్నామని, ఈ మేరకు రష్యాతో మాట్లాడుతున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి అశ్విని చౌబే తెలియజేశారు.

రష్యా తయారుచేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ కు సంబంధించిన సమాచారం ఇప్పటికే సీడీఎస్సీఓ (సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్)కు చేరిందని ఆయన తెలిపారు. కరోనాకు మొట్టమొదటి సారిగా వ్యాక్సిన్ ను తామే తయారు చేశామంటూ, దీన్ని రష్యా రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే. రష్యాకు చెందిన గమేలియా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, రక్షణ మంత్రిత్వ శాఖ దీన్ని తయారు చేశాయి. అయితే, రెండు నెలల పాటు మాత్రమే మానవులపై పరిశీలించిన తరువాత దీన్ని రిజిస్టర్ చేయడంతో పనితీరుపై పలువురు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం మూడవ దశ ట్రయల్స్ లో ఉన్న వ్యాక్సిన్ ను దాదాపు 40 వేల మందిపై పరిశీలిస్తున్నారని రష్యాకు చెందిన న్యూస్ ఏజన్సీ 'టీఏఎస్ఎస్' వెల్లడించింది. దేశంలోని 45 మెడికల్ సెంటర్లలో ఈ ప్రయోగాలు జరుగుతున్నాయని పేర్కొంది.

కాగా, వ్యాక్సిన్ ను ఇండియాలో పంపిణీ చేసేందుకు డా. రెడ్డీస్ కుదుర్చుకున్న డీల్ లో భాగంగా 10 కోట్ల డోస్ లు సిద్ధం కానున్నాయి. అయితే, ఈ డీల్, వ్యాక్సిన్ పంపిణీ కేంద్ర ఔషధ నియంత్రణా మండలి అనుమతిపై ఆధారపడివుంది. కరోనా నియంత్రణకు ఏ వ్యాక్సిన్ అయినా, ట్రయల్స్ పూర్తిగా విజయవంతమై, దాని పనితీరు సంతృప్తికరమని తేలిన తరువాతనే అనుమతి ఇస్తామని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది.