రెండు వారాలు నడుస్తున్నా, కార్తీకదీపం, గృహలక్ష్మి లను బీట్ చేయలేకపోయిన బిగ్ బాస్ సీజన్-4!

19-09-2020 Sat 08:24
Bigg Boss Season 4 TRP Rating Very Low
  • తొలి ఎపిసోడ్ కు మాత్రమే స్పందన
  • ఆపై వీక్షకుల నుంచి స్పందన కరవు
  • ఏడో స్థానంలో బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్

టాలీవుడ్ అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ - 4 తొలి వారం టీఆర్పీ రేటింగ్ లో చానెల్ నిర్వాహకులకు, షో యాజమాన్యానికి అసంతృప్తినే మిగిల్చింది. తొలి రోజునే సరైన పోటీదారులు లేరని, ఈ షో నిలవడం కష్టమేనని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓపెనింగ్ ఎపిసోడ్ కు అత్యధికంగా 18.5 టీఆర్పీ రేటింగ్ వచ్చినప్పటికీ, సగటున 'కార్తీకదీపం', 'గృహలక్ష్మి' సీరియల్స్ ను మాత్రం బీట్ చేయలేకపోయింది. బిగ్ బాస్ ప్రారంభమైన తొలివారంలో 'కార్తీకదీపం' ఆరో స్థానంలో నిలువగా, ఆపై 'గృహలక్ష్మి', దాని తరువాత బిగ్ బాస్ నిలవడం గమనార్హం.

కాగా, నాన్ ఫిక్షన్ షో కేటగిరీలో బార్క్ యూనివర్స్ లో ఇప్పటివరకూ ఏ ఎపిసోడ్ కూ రానంత రేటింగ్ బిగ్ బాస్ సీజన్ 4 తొలి ఎపిసోడ్ కు వచ్చిందని కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న స్టార్ మా అధికారికంగా వెల్లడించింది. అన్ని బిగ్ బాస్ షోలతో పోలిస్తే, లేటెస్ట్ షోకు అత్యధిక టీఆర్పీ 18.5 వచ్చిందని కూడా తెలియజేసింది. అయితే, ఆపై ఎపిసోడ్స్ ను మాత్రం వీక్షకులు అంత ఆసక్తిగా చూడటం లేదని సమాచారం.