మరోమారు లాక్‌డౌన్‌కు సిద్ధమవుతున్న యూకే!

19-09-2020 Sat 06:55
Britain ready to go lockdown for curb corona virus
  • జులై, ఆగస్టులో తగ్గుముఖం పట్టిన కేసులు
  • ప్రస్తుతం ప్రతి 8 రోజులకు రెట్టింపు అవుతున్న వైనం
  • రోజుకు 6 వేల కేసులు వెలుగులోకి

బ్రిటన్‌లో కరోనా మహమ్మారి మళ్లీ చెలరేగుతోంది. ఆసుపత్రులలో చేరుతున్న రోగుల సంఖ్య ఎక్కువవుతుండడంతో మరోమారు లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. జులై, ఆగస్టులో తగ్గుముఖం పట్టినట్టు కనిపించిన కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తుండడంతో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా ఉత్తర ఇంగ్లండ్, లండన్‌లలో రోజుకు ఆరువేల కేసులు నమోదవుతున్నాయి. గత వారంలో రోజుకు 3,200 కేసులు నమోదుకాగా, ఇప్పుడు ఏకంగా రెట్టింపు అయినట్టు ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ఓఎన్ఎస్) గణాంకాల ద్వారా తెలుస్తోంది.

ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్య ప్రతి 8 రోజులకు రెట్టింపు అవుతుండడంతో తప్పనిసరైతే మరోమారు దేశవ్యాప్త లాక్‌డౌన్ విధిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి మట్ హన్‌కాక్ తెలిపారు. అయితే, ఈ విషయంలో వచ్చేవారం నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు. కనీసం పబ్బులు, రెస్టారెంట్లు, క్లబ్ లపైన అయినా ఆంక్షలు విధిస్తామన్నారు. కాగా, ఇంగ్లండ్‌లో ఇప్పటి వరకు దాదాపు 4 లక్షల కేసులు నమోదు కాగా, 42 వేల మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.