Paytm: యూజర్లకు ఊరట... గూగుల్ ప్లే స్టోర్ లో మళ్లీ ప్రత్యక్షమైన పేటీఎం

  • నిబంధనలు పాటించడంలేదంటూ పేటీఎంను తొలగించిన గూగుల్
  • మళ్లీ వచ్చేశామంటూ పేటీఎం ప్రకటన
  • యూజర్లకు ఎలాంటి అసౌకర్యం కలగదంటూ వివరణ
Paytm re enters Google Play Sotre

ప్రముఖ ఆన్ లైన్ చెల్లింపుల యాప్ పేటీఎం మళ్లీ గూగుల్ ప్లే స్టోర్ లో ప్రత్యక్షమైంది. పేటీఎం యాప్ లో గ్యాంబ్లింగ్ కు ప్రోత్సాహం కల్పిస్తున్నారని, ఇది తమ నియమావళికి విరుద్ధమని గూగుల్ ఇంతక్రితం పేర్కొంది. పేటీఎంను, పేటీఎం ఫస్ట్ గేమ్స్ యాప్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. అయితే, గూగుల్ తమపై నిషేధం తొలగించిందంటూ పేటీఎం ట్విట్టర్ లో వెల్లడించింది.

తాజాగా మరో ట్వీట్ లో తమ ఆండ్రాయిడ్ యాప్ ను పునరుద్ధరించామని, ఎప్పట్లాగే గూగుల్ తో కలిసి పనిచేస్తామని పేటీఎం తెలిపింది. యూజర్లకు చెందిన నగదు బ్యాలెన్స్, అనుసంధానమైన ఖాతాలు 100 శాతం సురక్షితంగా ఉన్నాయని, ఈ మేరకు హామీ ఇస్తున్నామని పేర్కొంది. తమ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో పునఃప్రారంభమయ్యాయని, యూజర్లు గతంలోలా తమ సేవలు ఆస్వాదించవచ్చని పేటీఎం ట్వీట్ చేసింది.


More Telugu News