లక్ష ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయం: హరీశ్ రావు

18-09-2020 Fri 21:02
TRS will win Dubbaka election with over 1 lakh majority says Harish Rao
  • దుబ్బాక ఉపఎన్నికలో ఘన విజయం సాధిస్తాం
  • కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా రావు
  • ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించింది టీఆర్ఎస్ పార్టీనే

తెలంగాణలో అందరి దృష్టి ప్రస్తుతం దుబ్బాక ఉపఎన్నికపై ఉంది. ఈ ఎన్నికలో గెలిచి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని అధికార టీఆర్ఎస్ పార్టీ పట్టుదలతో ఉంది. తాము గెలవడం ద్వారా సత్తా చాటాలని కాంగ్రెస్, బీజేపీలు యత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, దుబ్బాక ఉపఎన్నికలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు కనీసం డిపాజిట్లయినా వస్తాయా? అనే విషయం ఈ ఎన్నికతో తెలుస్తుందని అన్నారు.

ఎన్నో ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయిందని చెప్పారు. ఆరేళ్ల తమ పాలనలో తాగునీరు, సాగునీరు అందించామని అన్నారు. దుబ్బాకపై ఉన్న అభిమానంతో మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 35 కోట్లు కేటాయించామని చెప్పారు. సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అక్బర్ పేటలో కొత్తగా నిర్మించిన గెస్ట్ హౌస్, అంబులెన్స్ ను హరీశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.