సమంత తప్పుకుంది.. ఐశ్వర్య రాజేశ్ ఒప్పుకుంది!

18-09-2020 Fri 20:49
Aishvarya Rajesh replaces Samantha in multi starrer
  • తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఐశ్వర్య 
  • 'ఆర్ఎక్స్ 100' దర్శకుడి 'మహా సముద్రం'
  • హీరోలుగా సిద్ధార్థ్, శర్వానంద్ ఎంపిక
  • మొదట్లో సమంతకు వచ్చిన ఆఫర్    

'కౌసల్య కృష్ణమూర్తి', 'వరల్డ్ ఫేమస్ లవర్' వంటి చిత్రాలలో నటించి మంచి నటిగా పేరుతెచ్చుకున్న కథానాయిక ఐశ్వర్య రాజేశ్ (ఒకప్పటి హీరో రాజేశ్ కూతురు, హాస్య నటి శ్రీలక్ష్మి మేనకోడలు) ప్రస్తుతం నాని సరసన 'టక్ జగదీశ్' సినిమాలో నటిస్తోంది. తమిళంలో పలు చిత్రాలు చేస్తూ బిజీగా వున్న ఈ అమ్మాయికి, తాజాగా తెలుగులో మరో మంచి అవకాశం వచ్చింది. సమంత చేయాల్సిన పాత్రను చేసే ఛాన్స్ ఇప్పుడీ ముద్దుగుమ్మకు వచ్చింది.

'ఆర్ఎక్స్ 100' చిత్రంతో పేరుతెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి తాజాగా 'మహా సముద్రం' పేరుతో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో మొదట్లో హీరోయిన్ గా సమంతను సంప్రదించగా, పాత్ర నచ్చడంతో చేయడానికి ఒప్పుకున్నట్టు వార్తలొచ్చాయి. అయితే, ఆ తర్వాత ఏవో కారణాలు చెప్పి ఆమె ఆ ప్రాజక్టు నుంచి తప్పుకుందట. దాంతో మరికొందరిని ప్రయత్నించినప్పటికీ, తాజాగా ఆ అవకాశం ఐశ్వర్యకు వచ్చినట్టు తెలుస్తోంది.