లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు చూపిస్తానని లిస్టు పంపారు... లిస్టు మాకెందుకు ఇళ్లు చూపించండని చెప్పా: భట్టి

18-09-2020 Fri 17:51
CLP leader Bhattai Vikramarka questions Talasani on double bedroom houses
  • తలసాని, భట్టి మధ్య డబుల్ బెడ్రూం ఇళ్ల రగడ
  • భట్టిని వెంటబెట్టుకుని డబుల్ బెడ్రూం ఇళ్లకు తిప్పుతున్న తలసాని
  • ఎన్నికల వేళ అబద్ధాలతో ఓట్లు దండుకోవడం టీఆర్ఎస్ నైజం  

తెలంగాణ కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పై ధ్వజమెత్తారు. డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో భట్టి, తలసాని మధ్య వాదోపవాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో మొదలైన ఈ రగడ సభాసమావేశాలు ముగిసిన తర్వాత కూడా కొనసాగుతోంది. తనతో వస్తే లక్ష ఇళ్లు చూపిస్తానన్న తలసాని... ఈ క్రమంలో స్వయంగా భట్టి ఇంటికి వెళ్లి మరీ ఆయనను తోడ్కొని వెళ్లారు.

అయితే తనకు నిన్న 3 వేల ఇళ్లను మాత్రమే చూపించారని, తనకు గ్రేటర్ పరిధిలోనే లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు చూపించాలని భట్టి స్పష్టం చేశారు. లక్ష ఇళ్లు చూపించేవరకు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, తలసానిని వదిలేది లేదని అన్నారు. లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు చూపిస్తానన్న తలసాని పారిపోయారని ఎద్దేవా చేశారు. లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు చూపిస్తానంటూ లిస్టు పంపారని, లిస్ట్ కాదు... లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు చూపించాలని తాము డిమాండ్ చేశామని భట్టి వివరించారు.  

తలసాని సవాల్ ను తాము స్వీకరించకుండా ఉండి ఉంటే... ప్రజలు టీఆర్ఎస్ పార్టీ చెప్పిందే నిజమని నమ్మేవాళ్లని, లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించింది వాస్తవమేనని అనుకునేవారని తెలిపారు. ఎన్నికల వేళ అబద్ధాలతో ఓట్లు దండుకోవడం, గెలిచిన తర్వాత హామీలు మర్చిపోవడం టీఆర్ఎస్ నైజమని విమర్శించారు.

అంతకుముందు, తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, తాము ఓట్ల కోసం ఇళ్లు కట్టివ్వడంలేదని, ఇళ్ల నిర్మాణం ఎప్పటి నుంచో ఉందని స్పష్టం చేశారు. భట్టి విక్రమార్క హైదరాబాదులో ఇళ్ల స్థలాల్ని చూపిస్తే తాము అక్కడే ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. హైదరాబాదులో జాగా లేదు కాబట్టే తాము శివారు ప్రాంతంలో ఇళ్లు కట్టిస్తున్నామని వెల్లడించారు. భట్టి విక్రమార్క ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుకోవాలని హితవు పలికారు. కావాలనుకుంటే లక్ష డబుల్  బెడ్ రూం ఇళ్ల లిస్టు పంపిస్తాను, చూసుకోండి అంటూ తలసాని వ్యాఖ్యానించారు.