ఒక్క ఏడాదిలో 18 ఘటనలు జరిగాయి సార్... ఏపీలో ఆలయాల దాడి ఘటనలపై అమిత్ షాకు లేఖ రాసిన జీవీఎల్, సీఎం రమేశ్

18-09-2020 Fri 17:23
BJP Rajyasabha member GVL writes to Amit Shah
  • సకాలంలో జోక్యం చేసుకోవాలంటూ అమిత్ షాకు విజ్ఞప్తి
  • హిందువులను అణచివేస్తున్నారంటూ వ్యాఖ్యలు
  • ఏపీ సర్కారుది పక్షపాత ధోరణి అంటూ ఆరోపణ

ఏపీలో గతకొంతకాలంగా ఆలయాలపై దాడి ఘటనలు తీవ్రతరం అవుతుండడం పట్ల బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేశ్ కలసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిద్దరూ అమిత్ షాకు లేఖ రాశారు. ఇటీవల అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన ఘటన, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మూడు సింహాల ప్రతిమలు మాయమైన ఘటనను కూడా తమ లేఖ ద్వారా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.

ఒక్క ఏడాదిలో ఇలాంటివే ఏపీలో 18 ఘటనలు జరిగాయని, కేంద్రం తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆలయాలపై జరుగుతున్న ఈ దాడులు ఏపీ ప్రజలనే కాకుండా, ఇతర ప్రాంతాల ప్రజల మనోభావాలను కూడా గాయపరుస్తున్నాయని తెలిపారు. హిందువుల సెంటిమెంట్లతో ముడిపడిన ఈ అంశాలపై దర్యాప్తుకు ఏపీ సర్కారు సరిగా స్పందించడంలేదని ఆరోపించారు.

ఈ ఘటనలను తీవ్రంగా పరిగణనలోకి తీసుకోని ఏపీ సర్కారు చర్చిలపై రాళ్లు విసిరిన ఘటనపై మాత్రం వెంటనే స్పందించిందని వెల్లడించారు. అంతర్వేది ఘటనపై ప్రభుత్వ నిర్లిప్త ధోరణిని ప్రశ్నిస్తూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న 41 మంది హిందూ కార్యకర్తలపై మాత్రం చర్చిలపై రాళ్లు వేశారంటూ తప్పుడు కేసులు బనాయించారని తెలిపారు. కొన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా వ్యవహరిస్తున్న ఏపీ ప్రభుత్వం హిందువులపై మాత్రం అణచివేత వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు.

హిందూ కార్యకర్తల అరెస్ట్ ని నిరసిస్తూ ఏపీ బీజేపీ నేతలు 'చలో అమలాపురం' కార్యక్రమానికి పిలుపునిస్తే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలను అక్రమంగా నిర్బంధించారని తెలిపారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును నిన్నటి నుంచి గృహనిర్బంధంలోనే ఉంచారని వెల్లడించారు. ఈ విషయంలో మీరు తక్షణమే జోక్యం చేసుకుని ఏపీలో చట్టం సరిగా అమలయ్యేలా చూడాలి అంటూ వారు అమిత్ షాను కోరారు.