Vijayasai Reddy: న్యాయమూర్తులకు ప్రత్యేక చట్టం ఉండదు... చట్టానికి అందరూ ఒకటే!: ఏపీ హైకోర్టు నిర్ణయాలపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు

  • ఏపీ హైకోర్టులో వైసీపీ సర్కారుకు వ్యతిరేక నిర్ణయాలు
  • ఆర్టికల్ 14ను ఉదహరించిన విజయసాయి
  • స్టే ఇచ్చే అధికారం హైకోర్టు న్యాయమూర్తులకు లేదన్న విజయసాయి
YCP General Secretary Vijayasai Reddy comments on AP High Court recent decisions

రాష్ట్రంలో ఎలాంటి ఘటన జరిగినా తమ ప్రభుత్వం నిష్పాక్షిక ధోరణి అవలంబిస్తోందని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఉద్ఘాటించారు. తమకు పక్షపాతం లేదని చెప్పేందుకే ఏ కేసునైనా సీబీఐకి అప్పగించాలని కేంద్రానికి ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల ఏపీ హైకోర్టు తీసుకున్న పలు నిర్ణయాలు పరిధికి మించి తీసుకున్నట్టుగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

మీడియాను అణచివేసేలా వెలువడిన ఆదేశాలు, ఏపీ పోలీసుల దర్యాప్తును నిలుపుదల చేస్తూ ఇచ్చిన ఆదేశాలు ఎంతవరకు చట్టబద్ధం అనేది పరిశీలించాలని అన్నారు. ముఖ్యంగా మీడియాను నియంత్రించేలా ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఆర్టికల్ 14 ప్రకారం రాజ్యాంగాన్ని ఉల్లంఘించే చర్య అని ఆరోపించారు. మీడియాను అదుపు చేసే అధికారం ఆర్టికల్ 14 ప్రకారం హైకోర్టుకు లేదని స్పష్టం చేశారు. భారత ప్రజాస్వామ్యానికి ఈ పరిణామం ఎంతో ప్రమాదకరమైనది అని విజయసాయిరెడ్డి అభివర్ణించారు.

"అవినీతి ఆరోపణల నేపథ్యంలో సెక్షన్ 19 ప్రకారం కేసు నమోదైంది. అయితే దీనిపై స్టే ఇచ్చే అధికారం న్యాయమూర్తులకు లేదు. అవినీతి నిరోధక చట్టంలో దీనిపై స్పష్టంగా చెప్పారు. సెక్షన్ 19 (3) (సి) ప్రకారం హైకోర్టుకు ఈ అధికారం లేదు. మిగతా చట్టాల్లో ఎలా చెప్పినా కూడా అవినీతి నిరోధక చట్టంలో మాత్రం స్టే ఇవ్వడానికి లేదు అని చెప్పారు.

చట్టంలో అంత స్పష్టంగా చెప్పినప్పుడు న్యాయమూర్తులు ఎలా స్టే ఇస్తారు? కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో స్టే ఇవ్వొచ్చని సుప్రీం కోర్టు చెప్పినా, ఇవాళ అలాంటి పరిస్థితులు ఈ కేసుకు లేవు.  ఏపీ పోలీసులపై నమ్మకం లేకపోతే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు ఇవ్వవచ్చు కదా... స్టే ఇవ్వాల్సిన అవసరం ఏంటి? దీనికి కోర్టే బదులు చెప్పాలి. చట్టం ఎవరికైనా ఒకటే. న్యాయమూర్తులకు ఒక ప్రత్యేక చట్టం ఉండదు, ప్రధానికైనా అంతే" అని స్పష్టం చేశారు.

అయితే హైకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు తమ న్యాయవాదులు ఈ అంశాలన్నీ న్యాయమూర్తుల దృష్టికి తీసుకువచ్చారా లేదా అనేది తెలియదని అన్నారు. ఒకవేళ అలా తీసుకురానట్టయితే అందుకు తమ న్యాయవాదులనే తప్పుబట్టాల్సి ఉంటుందని, ఎందుకంటే తమ వాదనలను న్యాయమూర్తులకు వినిపించాల్సిన బాధ్యత న్యాయవాదులపైనే ఉందని తెలిపారు. న్యాయవాదులు ఈ అంశాలన్నీ న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ న్యాయమూర్తులు చట్టవ్యతిరేకంగా వెళితే అప్పుడు న్యాయమూర్తులను తప్పుబట్టవచ్చని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తమ న్యాయవాదులతో కూడా చర్చిస్తామని విజయసాయిరెడ్డి చెప్పారు.

మామూలు పరిస్థితుల్లో ఏ కోర్టు కూడా విచారణ ఆపదని, ఆ అధికారం ఎవరికీ లేదని అన్నారు. కానీ ఏపీ హైకోర్టు ఓ కేసు విషయంలో మాత్రం అలాంటి నిర్ణయం తీసుకుందని అన్నారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే విచారణ కొనసాగించాలని నిర్ణయం వెలువరించిందని తెలిపారు.

More Telugu News