ప్లే స్టోర్ నుంచి పేటీఎంను తొలగించిన గూగుల్

18-09-2020 Fri 16:18
Google removes Paytm and Paytm First Game Fantasy apps from Play Store
  • జూదాన్ని ప్రోత్సహిస్తే సహించబోమన్న గూగుల్
  • పేటీఎంతో పాటు పేటీఎం ఫస్ట్ గేమ్ ఫాంటసీ యాప్ తొలగింపు
  • త్వరలోనే వస్తామన్న పేటీఎం

నిబంధనల విషయంలో రాజీపడేది లేదని టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి చాటిచెప్పింది. నియమావళి ఉల్లంఘించిందంటూ పేటీఎం యాప్ పై గూగుల్ కొరడా ఝుళిపించింది. పేటీఎంతో పాటు పేటీఎం ఫస్ట్ గేమ్ ఫాంటసీ యాప్ ను కూడా ప్లే స్టోర్ నుంచి తొలగించింది. దీనిపై గూగుల్ ప్రొడక్ట్ అండ్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ విభాగం వైస్ ప్రెసిడెంట్ సుజాన్నే ఫ్రే గూగుల్ బ్లాగ్ లో వివరణ ఇచ్చారు.

ఆన్ లైన్ జూదాన్ని లేక, ఆన్ లైన్ జూదానికి మద్దతు ఇవ్వాడాన్ని తాము ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. క్రీడలపై బెట్టింగ్ లకు అవకాశమిచ్చే గ్యాంబ్లింగ్ యాప్ లను తాము ప్రోత్సహించబోమని వెల్లడించారు. నగదు బహుమతులు అందించే వెబ్ సైట్లకు యూజర్లను తరలించే ఎలాంటి యాప్ కు ప్లే స్టోర్ లో స్థానం ఉండదని, అలాంటి వ్యవహార శైలి తమ పాలసీలకు విరుద్ధమని పేర్కొన్నారు.

గూగుల్ నిర్ణయం తర్వాత పేటీఎం సోషల్ మీడియాలో స్పందించింది. గూగుల్ ప్లే స్టోర్ లో పేటీఎం యాప్ తాత్కాలికంగా అందుబాటులో లేదని తెలిపింది. నూతన డౌన్ లోడ్లు, అప్ డేట్లు ప్రస్తుతం లభ్యం కావని వెల్లడించింది. త్వరలోనే తమ సేవలు పునరుద్ధరిస్తామని, యూజర్ల డబ్బు క్షేమంగా ఉంటుందని స్పష్టం చేసింది. త్వరలోనే పేటీఎం యాప్ కార్యకలాపాలు కొనసాగుతాయని, వినియోగదారులు యథావిధిగా తమ సేవలు అందుకోవచ్చని తెలిపింది.

పేటీఎం తన యాప్ లో ఫాంటసీ క్రీడల సేవలను ప్రోత్సహిస్తోందని, ఈ కారణంగానే పేటీఎం యాప్ తో పాటు పేటీఎంకు చెందిన పేటీఎం ఫస్ట్ గేమ్ ఫాంటసీ యాప్ ను కూడా ప్లే స్టోర్ నుంచి తొలగించినట్టు టెక్ నిపుణులు భావిస్తున్నారు. అయితే, పేటీఎంకు చెందిన పేటీఎం ఫర్ బిజినెస్, పేటీఎం మాల్, పేటీఎం మనీ యాప్ లు మాత్రం ప్లే స్టోర్ లో కొనసాగుతున్నాయి.