హెలికాప్టర్, ట్రైన్ పక్కన ఫొటో దిగితే అవి మన సొంతం అవుతాయా?: టీడీపీ నేతల ఆరోపణలపై మంత్రి జయరాం వ్యంగ్యం

18-09-2020 Fri 15:56
AP Minister Gummanur Jayaram reacts to TDP allegations
  • మంత్రి కుమారుడికి బెంజ్ కారు లంచం అంటూ టీడీపీ ఆరోపణలు
  • టీడీపీ నేతల ఆరోపణలను ఖండించిన మంత్రి జయరాం
  • ఆ కారు పక్కన తన కుమారుడు ఫొటో దిగాడని వెల్లడి
  • కారు తమదేనని నిరూపిస్తే రాజీనామా చేస్తానని స్పష్టీకరణ

ఈఎస్ఐ స్కాంలో నిందితుడు తెలకపల్లి కార్తీక్ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కుమారుడు ఈశ్వర్ కు ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కారు బహుమతిగా ఇచ్చాడంటూ టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తుండడం తెలిసిందే. ఈ ఆరోపణలపై మంత్రి జయరాం స్పందించారు.

కర్నూలు జిల్లా ఆలూరులో మీడియాతో మాట్లాడుతూ...  టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి ఆ బెంజ్ కారు తన కుమారుడిది కాదని, ఆ కారు పక్కన ఫొటో దిగాడని వివరణ ఇచ్చారు. ఆ బెంజ్ కారు మాదే అని నిరూపించండి... పదవికి రాజీనామా చేస్తాను అని జయరాం స్పష్టం చేశారు. అయినా, హెలికాప్టర్, ట్రైన్ పక్కన ఫొటోలు దిగినంత మాత్రాన అవి మన సొంతం అవుతాయా? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

తమపై టీడీపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. మతి భ్రమించి మాట్లాడుతున్న టీడీపీ నేతలు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.