తెలంగాణ ఏర్పాటు సమయంలో ఫ్లోరైడ్ గ్రామాల సంఖ్య 967... ఇప్పుడు సున్నా: కేటీఆర్

18-09-2020 Fri 14:34
KTR says there is no fluoride affected villages in Telangana now
  • ఫ్లోరైడ్ పరిస్థితులపై కేంద్రం నివేదిక
  • మిషన్ భగీరథ చలవతో అద్భుత ఫలితాలు వచ్చాయన్న కేటీఆర్
  • మిషన్ భగీరథ బృందానికి అభినందనలు

దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఫ్లోరైడ్ సమస్య అనేక తరాల ప్రజలను పట్టి పీడిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆసక్తికర వివరాలు తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఫ్లోరైడ్ ప్రభావిత, ప్రభావ రహిత రాష్ట్రాలతో ఓ జాబితా విడుదల చేసింది. దీనిపై తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ ఏర్పాటు వేళ రాష్ట్రంలో 967 ఫ్లోరైడ్ గ్రామాలు ఉన్నాయని, ఇప్పుడు వాటి సంఖ్య సున్నా అని సగర్వంగా తెలిపారు.

ఇదంతా మిషన్ భగీరథ కార్యాచరణ ఫలితమేనని, ప్రతి ప్రాంతానికి కృష్ణా, గోదావరి సుజలాలు అందిస్తున్నామని ఉద్ఘాటించారు. కేంద్రం ప్రకటనను తెలంగాణ పట్ల ఓ మెచ్చుకోలుగా భావిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ బృందానికి అభినందనలు తెలుపుకుంటున్నానని కేటీఆర్ ట్విట్టర్ లో వివరించారు. మిషన్ భగీరథ పథకంతో ఒనగూరిన ఫలితాలకు కేంద్రం విడుదల చేసిన నివేదికే స్పష్టమైన నిదర్శనం అని తెలిపారు. తెలంగాణలో ఒక్క ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామం కూడా లేదని కేంద్రం ప్రకటన ద్వారా స్పష్టమైందని పేర్కొన్నారు.

కాగా, ఏపీలో 2015 నాటికి ఫ్లోరైడ్ పీడిత గ్రామాల సంఖ్య 402 అని, ఇప్పుడవి 111కి తగ్గాయని కేంద్రం నివేదికలో పేర్కొన్నారు. దేశంలో అత్యధికంగా ఫ్లోరైడ్ ప్రభావం ఉన్న రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. 2015లో అక్కడ 7,056 గ్రామాలు ఫ్లోరైడ్ ప్రభావంతో బాధపడుతుండగా, ఇప్పుడు వాటి సంఖ్య 3,095కి తగ్గింది.