'సర్కారు వారి పాట'లో కథానాయిక మారుతోందా?

18-09-2020 Fri 13:32
Heroine replaced in Sarkaru Vari Pata
  • బ్యాంకు స్కాముల నేపథ్యంలో మహేశ్ సినిమా 
  • కథానాయికగా కీర్తి సురేశ్ పేరు ప్రచారం
  • ప్రస్తుతం మరికొందరి పేర్లు పరిశీలిస్తున్న వైనం
  • డెట్రాయిట్ లో భారీ షెడ్యూల్ కి ఏర్పాట్లు  

మహేశ్ బాబు తన తాజా చిత్రాన్ని పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి విదితమే. 'సర్కారు వారి పాట' పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవలి కాలంలో తరచుగా వినిపిస్తున్న బ్యాంకు స్కాముల నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుందని అంటున్నారు. ఇందులో కథానాయికగా కీర్తి సురేశ్ పేరు ఇటీవల బాగా ప్రచారం అయ్యింది. ఆమెను బుక్ చేసినట్టుగా యూనిట్ వర్గాలు కూడా పేర్కొన్నాయి.

అందుకు తగ్గట్టుగా ఒకానొక సందర్భంలో  కీర్తి కూడా అభిమానులతో ఛాట్ చేస్తూ ఈ చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తావించింది కూడా. అయితే, తాజా సమాచారాన్ని బట్టి, కీర్తి సురేశ్ ను మార్చే అవకాశం వుందని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ విషయంపై చిత్ర నిర్మాతలు, దర్శకుడు చర్చించి, మరొక స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో మరికొందరి పేర్లను ప్రస్తుతం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదిలావుంచితే, ఈ చిత్ర కథను బట్టి అమెరికాలో కొంత షూటింగ్ చేయాల్సివుందట. అందుకోసం డెట్రాయిట్ నగరానికి వెళుతున్నట్టు సమాచారం. అక్కడ భారీ షెడ్యూలు నిర్వహిస్తారని, లొకేషన్ల ఎంపిక కోసం త్వరలో దర్శకుడు, ఛాయాగ్రాహకుడు త్వరలో డెట్రాయిట్ వెళతారని అంటున్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో అక్కడ షూటింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.