New Delhi: కారులో వున్న వ్యక్తికి మాస్క్ లేదని ఫైన్ వేసిన ఢిల్లీ పోలీసులు... రూ.10 లక్షల పరిహారాన్ని డిమాండ్ చేస్తూ కోర్టులో కేసు!

  • ఒంటరిగా కారులో వెళుతుంటే ఫైన్ వేశారు
  • ఒక్కడినే ఉంటే మాస్క్ అక్కర్లేదని స్పష్టంగా ఉంది
  • పోలీసులు మానసికంగా వేధించారని కేసు
Lawyer Case On Delhi Police after Fine

న్యూఢిల్లీలో ఓ న్యాయవాది కారులో ప్రయాణిస్తున్న వేళ, మాస్క్ ధరించలేదంటూ పోలీసులు రూ. 500 ఫైన్ వేయగా, తన పరువు పోయిందని, తాను అన్ని నిబంధనలనూ పాటిస్తున్నానని చెబుతూ, కోర్టును ఆశ్రయించాడు. అంతేకాదు, ఢిల్లీ పోలీసుల నుంచి తనకు రూ.10 లక్షలు పరిహారం ఇప్పించాలంటూ అతను వేసిన పిటిషన్ లో చేసిన వ్యాఖ్యలు సహేతుకంగా ఉండటంతో, పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది.

మరిన్ని వివరాల్లోకి వెళితే, సదరు న్యాయవాది కారులో వెళుతుంటే పోలీసులు ఆపారు. మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశంలో కారు నడుపుతున్నాడని ఆరోపిస్తూ, జరిమానా విధించారు. దీనిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన లాయర్, తాను తన సొంత కారులో ఒక్కడినే ఉన్నానని, అటువంటి సమయాల్లో మాస్క్ అవసరం లేదని కేంద్ర మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రజల మధ్యకు వెళితే, తాను మాస్క్ ధరిస్తానని, ఒంటరిగా ఉన్న సమయంలో అది అవసరం లేదని అన్నాడు.

తాను కరోనా నిబంధనలను అన్నిటినీ పాటిస్తున్నానని, అయినా తనను అన్యాయంగా పోలీసులు వేధించి, ఫైన్ కట్టించారని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చాడు. తనకు ఎంతో మానసిక ఒత్తిడి కలిగిందని, తాను ఒంటరిగా ఉన్న వేళ, మాస్క్ ధరించక పోవడం ఇతరులకు హాని కలిగించినట్టు కాదని స్పష్టం చేశాడు. ఈ కేసును నవంబర్ 18న విచారిస్తామని జస్టిస్ నవీన్ చావ్లాతో కూడిన సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది.

More Telugu News