UAE: అభిమానుల కేరింతలు, ఛీర్ లీడర్స్ సందడి లేకుండానే... ఐపీఎల్ కు వేళాయె!

  • రేపటి నుంచి ఐపీఎల్-2020
  • ప్రారంభ వేడుకలు లేకుండానే మొదలు
  • తదుపరి దశలో 30 శాతం మంది అభిమానులకు ఎంట్రీ
  • టీవీ వీక్షకుల సంఖ్య పెరగవచ్చన్న గంగూలీ
No Fans and Cheerleaders for IPL 2020

వేసవిలో ఎంతో ఆర్భాటంగా జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పోటీలు కాస్తంత ఆలస్యంగా, రేపటి నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం పోటీలన్నీ అభిమానుల కేరింతలు, ఛీర్ లీడర్స్ సందడి, జిగేల్మనే విద్యుత్ కాంతులు తదితరాలు ఏమీ లేకుండానే సాగనున్నాయి. ఇదే సమయంలో కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన వారికి, ముఖ్యంగా క్రికెట్ అభిమానులకు కాస్తంత మానసిక ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగించనున్నాయి.

ఇక తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య, శనివారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఐపీఎల్ పోటీలను ప్రారంభిస్తూ జరిగే వేడుకల కార్యక్రమం ఈ సంవత్సరం రద్దయింది. దుబాయ్, షార్జాల్లోని స్టేడియాల్లో తొలి దశ మ్యాచ్ లన్నీ అభిమానులు లేకుండానే సాగనుండగా, తదుపరి దశలో పరిస్థితిని బట్టి, 30 శాతం మంది ఫ్యాన్స్ ను అనుమతించే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

ఇక 13వ సీజన్ పోటీలను టీవీల్లో వీక్షించే వారి సంఖ్య మరింతగా పెరుగుతుందని భావిస్తున్నట్టు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించారు. ఈ సీజన్ లో టీవీ స్లాట్లలో ప్రైమ్ టైమ్ లో ప్రసారమయ్యే క్రికెట్ పోటీలకు అత్యధిక వ్యూవర్ షిప్ రేటింగ్ లభిస్తుందని ప్రసార సంస్థలు అంచనా వేస్తున్నాయని ఆయన తెలిపారు. అంతా సక్రమంగానే సాగుతుందని భావిస్తున్నట్టు తెలిపారు.

"కరోనా కారణంగా ప్రస్తుతం అభిమానులు ఒకరి పక్కన ఒకరు కూర్చుని ఆటను ఆస్వాదించే పరిస్థితి లేదు. అయితే, పోటీలు నవంబర్ 10 వరకూ ఉంటాయి కాబట్టి, తదుపరి దశలో కొంతమేరకైనా అభిమానులను స్టేడియంలోకి అనుమతించే అవకాశాలు ఉన్నాయి. భౌతిక దూరం పాటించడాన్ని తప్పనిసరి చేస్తూ, 30 శాతం కెపాసిటీ నిండేలా టికెట్లను విక్రయించే అవకాశముంది. స్టేడియానికి వచ్చే ప్రతి ఒక్కరికీ ధర్మల్ స్క్రీనింగ్, స్టేడియంలో శానిటైజేషన్ ఉంటుంది" అని స్పష్టం చేశారు.

More Telugu News