Ashok Gasti: కరోనాతో బీజేపీ రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ కన్నుమూత.. ధ్రువీకరించిన ఆసుపత్రి యాజమాన్యం

  • అశోక్ గస్తీ మృతి విషయంలో తొలుత గందరగోళం
  • మొదట చనిపోయినట్టు వార్తలు.. ఖండించిన వైద్యులు
  • రాత్రి 10.31 గంటల సమయంలో కన్నుమూత
Ashok Gasti 1st Time Rajya Sabha Member Dies Of COVID

కర్ణాటకకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ (55) కరోనాతో కన్నుమూశారు. కరోనా బారినపడి బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన చనిపోయినట్టు తొలుత వార్తలు వచ్చాయి. దీంతో పలువురు రాజకీయ నాయకులు ఆయన మృతికి సంతాపం తెలపుతూ ట్వీట్లు చేశారు. దీంతో స్పందించిన ఆసుపత్రి యాజమాన్యం ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఐసీయూలో లైఫ్ సపోర్ట్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొంది. దీంతో అశోక్ గస్తీ మృతి విషయంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది.

అయితే, గతరాత్రి ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ మనీష్ రాయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. అశోక్ గస్తీ రాత్రి 10.31 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్టు వెల్లడించారు. అశోక్ గస్తీ ఆసుపత్రిలో చేరినప్పుడు తీవ్ర న్యూమోనియాతో బాధపడుతున్నారని, అలాగే, ఆయన శరీరంలోని చాలా భాగాలు పనిచేయడం మానేశాయని పేర్కొన్నారు. ఐసీయూలో లైఫ్ సపోర్ట్‌పై ఉంచి చికిత్స అందించినట్టు తెలిపారు.

అశోక్ గస్తీ ఉత్తర కర్ణాటకలోని రాయచూర్‌కు చెందినవారు. బూత్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. గస్తీ అంకితభావం కలిగిన కార్యకర్త అని పేర్కొన్న ప్రధాని నరేంద్రమోదీ ఆయన మృతికి సంతాపం తెలిపారు.

More Telugu News