Talasani: అనూహ్య పరిణామం.. కాంగ్రెస్‌ నేత భట్టి సవాలును స్వీకరించి, ఆయన ఇంటికి వచ్చిన మంత్రి తలసాని

  • హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఎక్కడున్నాయని భట్టి ప్రశ్న
  • నిన్న శాసనసభలో వాగ్వివాదం
  • చూపిస్తానని నిన్న శాసనసభలో భట్టికి తలసాని సవాల్
  • ఈ రోజు భట్టితో కలిసి కారులో పయనం
batti talasani meet

హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం అంటూ ప్రభుత్వం అసత్య వ్యాఖ్యలు చేస్తోందని, అవి ఎక్కడ కట్టారో తమకు చూపించాలని తెలంగాణ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క నిన్న సవాల్ చేశారు. దానికి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంగీకరించి, ఆ సవాలును స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అధికారులతో కలిసి తలసాని ఈ రోజు ఉదయం భట్టి విక్రమార్క ఇంటికి వచ్చారు.

ఆయన వస్తారని ఊహించని భట్టి మొదటి షాక్ అయ్యారు. అనంతరం ఇంట్లోకి రమ్మని పిలిచి, ఇంట్లో కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు. నగరంలో తమ సర్కారు నిర్మించిన ఇళ్లను చూపిస్తామని తమతో రావాలని ఆయన కోరారు. దీంతో భట్టి విక్రమార్క అందుకు ఒప్పుకున్నారు. అనంతరం వారిద్దరు ఒకే కారులో ఇళ్లను చూడడానికి బయలుదేరారు.

కాగా,  నిన్న తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతోన్న సమయంలో  టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలపై భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు గుప్పించారు. జీహెచ్‌ఎంసీ పరిధితో పాటు ఇతర పట్టణాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతులపై ఆయన ప్రశ్నించారు. ఆయా ప్రాంతాల్లో ఆ వసతులు ఉన్నాయంటే గతంలో కాంగ్రెస్ చేసిన పనుల వల్లేనని, టీఆర్‌ఎస్‌ ఏమీ చేయలేదని అన్నారు.

దీంతో ఆయనపై తలసానితో పాటు పలువురు మంత్రులు మండిపడ్డారు.  దీంతో భట్టి మళ్లీ కలుగజేసుకుని మంత్రి కేటీఆర్‌ తన ప్రసంగంలో లక్ష ఇళ్లు నిర్మించి ఇస్తామని అన్నారని గుర్తు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలప్పుడే ఇళ్లు గుర్తుకొస్తాయా? అని ఎద్దేవా చేశారు. నగరంలో లక్ష ఇళ్లు ఎక్కడ నిర్మించారో చూపించాలని ఆయన డిమాండ్ చేశారు.

దీంతో  భట్టి మైక్‌ను స్పీకర్‌ కట్‌ చేశారు. ఈ పరిణామంతో కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టేందుకు ముందుకు వెళ్లారు. దీంతో తలసాని ఆ సమయంలో మాట్లాడుతూ... రేపు ఉదయం భట్టి ఇంటికి వస్తానని, నగరంలో ఎక్కడెక్కడ డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు నిర్మించామో స్వయంగా చూపిస్తానని అన్నారు.

దీంతో భట్టి మాట్లాడేందుకు స్పీకర్ మళ్లీ అవకాశం ఇచ్చారు. సమయం చెబితే తానే వస్తానని, లక్ష ఇళ్లు ఎక్కడ కట్టించారో చూపాలన్నారు. దీంతో తలసాని ఈ రోజు భట్టి ఇంటికి వెళ్లి వాటిని చూపిస్తాననడంతో ఇద్దరూ కలిసి వాటిని చూడడానికి వెళ్లారు.

More Telugu News