cyber crime: వీడియో కాల్‌ ద్వారా రెచ్చగొట్టిన యువతి.. సైబర్ నేరగాళ్లకు రూ. 2 లక్షలు సమర్పించుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్!

  • సైబర్ నేరగాళ్ల నుంచి డేటింగ్ మెసేజ్
  • ఫోన్ చేసి అడ్డంగా బుక్కైపోయిన యువకుడు
  • అతడి ఫొటో, వీడియోలు క్యాప్చర్ చేసి బ్లాక్ మెయిల్
software engineer cheated by cyber criminals

‘అందమైన అమ్మాయిలతో డేటింగ్ చేయాలనుకుంటున్నారా?’ అంటూ వచ్చిన  మెసేజ్‌ చూసి ఆవేశపడిన హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సైబర్ నేరగాళ్ల బారినపడి రూ. 2 లక్షలు సమర్పించుకున్నాడు. చివరికి తన నగ్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాకెక్కడంతో ఏం చేయాలో పాలుపోక పోలీసులను ఆశ్రయించాడు.

సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసుల కథనం ప్రకారం.. వర్క్‌ఫ్రం హోం చేస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఇటీవల సైబర్ నేరగాళ్ల నుంచి ఓ మెసేజ్ వచ్చింది. అందమైన అమ్మాయిలతో డేటింగ్ చేయాలనుకుంటే వెంటనే మీటింగ్ చేస్తామని, పలానా నంబరుకు కాల్ ‌చేయాలన్నది ఆ మెసేజ్ సారాంశం.

ఆ మెసేజ్ చూసిన బాధితుడు ఆగలేకపోయాడు. వెంటనే అందులో ఉన్న నంబరుకు ఫోన్ చేశాడు. వెంటనే ఓ యువతి లైన్‌లోకి వచ్చింది. అతడు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పిన యువతి తమ వద్దనున్న ప్యాకేజీల గురించి అతడికి వివరించింది. దీంతో రిజిస్ట్రేషన్ రుసుము కింద కొంత మొత్తాన్ని చెల్లించాడు.

ఆ వెంటనే కొందరు యువతుల నగ్న చిత్రాలు అతడి ఫోన్‌కు వచ్చాయి. ఆ తర్వాత కాసేపటికే ఓ యువతి చాటింగ్ మొదలుపెట్టింది. రూ. 20 వేలు చెల్లిస్తే నగ్నంగా వీడియో కాల్‌లో మాట్లాడతానని చెప్పడంతో సరేనని రూ. 20 వేలు చెల్లించాడు. దీంతో ఆమె నగ్నంగా మాట్లాడింది. బాధితుడు కూడా ఒంటి మీద నూలుపోగు లేకుండానే ఆమెతో మాట్లాడాడు. అతడు మాట్లాడుతున్న సమయంలో బాధితుడి నగ్న ఫొటోలు, వీడియోను క్యాప్చర్ చేసిన సైబర్ నేరగాళ్లు అనంతరం వాటిని చూపించి బాధితుడి నుంచి పలు దఫాలుగా రూ. 2 లక్షలు పిండుకున్నారు.  

ఆ తర్వాత సైబర్ నేరగాళ్ల నుంచి వచ్చే కాల్స్‌ను బాధితుడు లిఫ్ట్ చేయకపోవడంతో వారు అతడి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News