Rahul Gandhi: మోదీజీ, ఎందుకంతగా భయపడుతున్నారు?: రాహుల్ గాంధీ

  • కేంద్రమంత్రులు, ప్రధాని పరస్పర విరుద్ధ ప్రకటనలు
  • అన్నింటినీ గుర్తు చేస్తూ రాహుల్ తీవ్ర విమర్శలు
  • విదేశాల నుంచి ట్విట్టర్ ద్వారా ప్రశ్నాస్త్రాలు
Rahul Gandhi Slams Modi on China Issue

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చైనాను చూసి మోదీ ఎందుకంతగా భయపడుతున్నారని ప్రశ్నించారు. సరిహద్దులో ఎవరూ ప్రవేశించలేదని మోదీ ఒకసారి చెప్పారని, కానీ అదే సమయంలో చైనాతో సంబంధం ఉన్న బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో రుణం తీసుకున్నారని అన్నారు. ఆ తర్వాత దేశాన్ని చైనా ఆక్రమించిందని రక్షణ మంత్రి చెప్పారని, ఇప్పుడేమో ఎటువంటి చొరబాట్లు జరగలేదని హోం మంత్రి చెబుతున్నారని, అసలేం జరుగుతోందని రాహుల్ ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం భారత ఆర్మీతో ఉందా? లేక, చైనాకు మద్దతు ఇస్తోందా? అని ప్రశ్నించారు.

వైద్యం కోసం విదేశాలకు వెళ్లిన తల్లి సోనియాగాంధీ వెంట ఉన్న రాహుల్ పార్లమెంటు సమావేశాలకు హాజరుకాలేకపోయారు. అయినప్పటికీ ట్విట్టర్ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. రాజ్యసభలో నిన్న ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ మాట్లాడుతూ గత ఆరు నెలల కాలంలో భారత్, చైనా సరిహద్దులో ఎలాంటి చొరబాట్లు జరగలేదని స్పష్టం చేశారు.

అంతకుముందు రోజు రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ వాస్తవాధీనరేఖ వద్ద యథాతథస్థితిని మార్చే చైనా కుట్రను భారత్ అడ్డుకుంటుందని, లడఖ్ ప్రాంతంలో మన దేశం కఠిన సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపారు. జూన్‌లో ప్రధాని మాట్లాడుతూ భారత భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని, ఏ పోస్టును ఆక్రమించలేదని పేర్కొన్నారు.

కాగా, అదే నెలలో ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు నుంచి భారత్ 750 మిలియన్ డాలర్ల రుణం తీసుకున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీటన్నింటినీ ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ తాజాగా ట్వీట్ చేశారు.

More Telugu News