Chandrababu: బల్లి దుర్గాప్రసాద్ ఇకలేరన్న వార్త ఎంతో బాధ కలిగించింది: చంద్రబాబు

Chandrababu conveys his deepest condolences to the demise of Balli Durga Prasad
  • కరోనా చికిత్స పొందుతూ తిరుపతి ఎంపీ మృతి
  • ప్రగాఢ సంతాపం తెలిపిన చంద్రబాబు
  • తీవ్ర విచారం కలిగిస్తోందన్న నారా లోకేశ్
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ చెన్నైలో కరోనా చికిత్స పొందుతూ గుండెపోటుకు గురై మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్ లో తన స్పందన తెలియజేశారు. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఇక లేరన్న వార్త తెలిసి ఎంతో బాధ కలిగిందని వివరించారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, మిత్రులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. బల్లి దుర్గాప్రసాద్ గతంలో నాలుగు సార్లు టీడీపీ తరఫున గూడూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గతంలో ఓసారి మంత్రిగానూ వ్యవహరించారు.

ప్రాణాంతక వైరస్ కు బలికావడం తీవ్ర విచారకరం: నారా లోకేశ్

ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతిపై ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుకుంటున్నానని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. కరోనా మహమ్మారితో పోరాటంలో ఆయన మృత్యువుకు బలయ్యారని తెలిపారు. ప్రాణాంతక వైరస్ ఆయనను కబళించడం తీవ్ర విచారం కలిగిస్తోందని ట్వీట్ చేశారు.

సుదీర్ఘకాలం టీడీపీలో కలిసి పనిచేశాం: సోమిరెడ్డి

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు హఠాన్మరణం బాధాకరమని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. తామిద్దరం సుదీర్ఘకాలం టీడీపీలో కలిసి పనిచేశామని గుర్తుచేసుకున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా ఆయనకు అవకాశం లభించిందని, ఒక మంచి మిత్రుడ్ని కోల్పోయానని తెలిపారు.



Chandrababu
Balli Durga Prasad
Death
Corona Virus
Nara Lokesh
Somireddy Chandra Mohan Reddy
Telugudesam

More Telugu News