IJU: ఎఫ్ఐఆర్ మీడియాలో ప్రసారం చేయొద్దన్న హైకోర్టు నిర్ణయంపై ఐజేయూ స్పందన

  • మాజీ అడ్వొకేట్ జనరల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ
  • మీడియాలో రావడంపై హైకోర్టు అభ్యంతరం
  • హైకోర్టు నిర్ణయం దురదృష్టకరమని పేర్కొన్న ఐజేయూ
IJU reacts to High Court orders media not to publish FIR

అమరావతి భూముల లావాదేవీల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై వైసీపీ సర్కారు సిట్ వేసిన సంగతి తెలిసిందే. సిట్ నివేదిక నేపథ్యంలో మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్ మీడియాలో రావడానికి వీల్లేదంటూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు నిర్ణయం పట్ల అధికార వైసీపీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) కూడా ఈ వ్యవహారంపై ఓ ప్రకటన చేసింది. మాజీ అడ్వొకేట్ జనరల్ పైనా, ఓ జడ్జి బంధువులపైనా ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను ప్రచురించవద్దని ప్రింట్ మీడియాను, ప్రసారం చేయవద్దని ఎలక్ట్రానిక్ మీడియాను ఆదేశించడం అత్యంత దురదృష్టకరం అని పేర్కొంది.

ఇది పత్రికా స్వేచ్ఛను నిరాకరించడమే కాకుండా సమాచారం తెలుసుకునే హక్కును ప్రజలకు దూరం చేయడమేనని ఐజేయూ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి బల్విందర్ సింగ్ జమ్మూ పేర్కొన్నారు. ఫోర్త్ ఎస్టేట్ గా పేరుగాంచిన మీడియా హక్కులు, అధికారాలను హైకోర్టు నిర్ణయం పరిధిని మించినట్టుగా ఉందని భావిస్తున్నామని తెలిపారు.


More Telugu News