Mallu Bhatti Vikramarka: దళితులకు పంచేందుకు మూడెకరాలు లేకుంటే.. రూ. 22 లక్షల చొప్పున డిపాజిట్ చేయండి: భట్టి విక్రమార్క

SCST MLAs and MLCs meeting Held in Telangana Assembly Committee Hall
  • అసెంబ్లీ కమిటీ హాలులో ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం
  • ప్రభుత్వానికి పలు సూచనలు చేసిన ఎమ్మెల్యేలు
  • ఆరేళ్లు గడిచినా డబుల్ బెడ్రూం ఇళ్లకు అతీగతీ లేదన్న భట్టి
దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూమి దొరకని పక్షంలో మూడెకరాలకు నిర్ణయించిన రూ. 22 లక్షలను డిపాజిట్ చేసి దానిపై వచ్చే ఆదాయాన్ని ఆయా లబ్ధిదారుల కుటుంబాలకు చెందేలా చేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వానికి సూచించారు. అసెంబ్లీ కమిటీ హాలులో నిన్న జరిగిన ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో భట్టి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.  అసైన్డ్‌భూములకు సంబంధించి సాంఘిక సంక్షేమ, గిరిజన శాఖల మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాథోడ్‌ల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.

డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తానని చెప్పి ఆరున్నరేళ్లు గడిచినా అతీగతీ లేదని భట్టి విమర్శించారు. దళితులు, గిరిజనుల కుటుంబాలందరికీ మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఆరువేల మందికి మాత్రమే పంచారని పేర్కొన్నారు. ప్రైవేటు వర్సిటీలలో రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సమావేశ ప్రారంభంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ..  దళిత, గిరిజనులకు ప్రభుత్వం ఇంకా ఎలాంటి కార్యక్రమాలు అమలు చేస్తే బాగుంటుందో చర్చించేందుకే ఈ సమావేశాన్ని నిర్వహించినట్టు చెప్పారు.  మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితులు, గిరిజనులు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అలాగే, ఫారెస్ట్ అధికారుల నుంచి వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు.  

దళితులు, గిరిజనులకు ఆర్థిక పథకాలు అమలు చేయాలని, వ్యవసాయ ఉపకరణాలైన ట్రాక్టర్లు, నాటు వేసే యంత్రాలు, కోతమిషన్లు, హార్వెస్టర్లు అందించాలని, భూమి లేని రైతులకు ఎస్సీ, ఎస్టీ రైతులకు కూడా రైతు బంధు, రైతు బీమా అమలు చేయాలని, దళిత, గిరిజన వాడల్లో విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని, ఎస్సీ, ఎస్టీలందరికీ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇవ్వాలని ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు సూచనలు చేశారు. అలాగే, ఎస్టీ, ఎస్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సాంకేతిక కళాశాలలు ఏర్పాటు చేయాలని, ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉపాధ్యాయ పోస్టులను స్థానిక గిరిజనులతో భర్తీ చేయాలని కోరారు.
Mallu Bhatti Vikramarka
Telangana
Congress
SC ST
MLAs
MLC

More Telugu News