కేరళలో మరో ‘జార్జ్ ఫ్లాయిడ్’ ఉదంతం.. వ్యక్తిని నేలకేసి కొట్టి అతడిపై కూర్చున్న పోలీసు అధికారి

Wed, Sep 16, 2020, 06:59 AM
Kerala Police Recreates George Floyd Scene On Protester
  • మంత్రి జలీల్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
  • పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కిందపడిన కార్యకర్త
  • అతడి తలను నేలకు గట్టిగా అదిమి పట్టి మంత్రి కాన్వాయ్ వెళ్లే వరకు కూర్చున్న పోలీసు అధికారి
అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ ఘటన రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఇది దేశవ్యాప్త అల్లర్లు, ఆందోళనలకు కారణమైంది. ఇప్పుడు అచ్చం ఇలాంటి  ఘటనే ఒకటి కేరళలో జరిగింది. ఓ వ్యక్తిని నేలకేసి కొట్టిన పోలీసు అధికారి అతడిపై కూర్చున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పోలీసుల తీరుపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి కేటీ జలీల్ కాన్వాయ్ వెళ్తున్న సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బంగారం స్మగ్లింగ్ కేసులో మంత్రి జలీల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించడంతో ఆయన రాజీనామా చేయాలంటూ కేరళ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం నిరసన ప్రదర్శన చేపట్టారు. అదే సమయంలో మంత్రి జలీల్ కాన్వాయ్ వస్తుండడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకునేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆంటోనీ అనే కార్యకర్త కిందపడిపోయాడు. అప్పటికే అతడి వద్దకు చేరుకున్న పోలీసు అధికారి ఆంటోనీని నేలకేసి గట్టిగా అదిమిపట్టి మంత్రి కాన్వాయ్ వెళ్లిపోయే వరకు ఆయనపై కూర్చున్నారు. దీనిని గమనించిన సహచరులు అక్కడికి చేరుకుని అతనిని రక్షించారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేరళ కాంగ్రెస్ నేత వీటీ బలరామ్ ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ పినరయి విజయన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆంటోనీ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అమెరికాలో పోలీసుల దౌర్జన్యం కారణంగా మరణించిన జార్జ్ ఫ్లాయిడ్‌ను తలపిస్తోందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha