YV Subba Reddy: ఢిల్లీలో నిర్మలా సీతారామన్ ను కలిసిన వైవీ సుబ్బారెడ్డి... జీఎస్టీ మాఫీ కోసం విజ్ఞప్తి

  • జీఎస్టీ రద్దుతో మరిన్ని కార్యక్రమాలు చేయగలుగుతామని వెల్లడి
  • పాత నోట్లపై ఆర్బీఐని ఆదేశించాలని విజ్ఞప్తి
  • భక్తులు పెద్ద సంఖ్యలో పాత నోట్లు హుండీలో వేశారన్న వైవీ
YV Subbareddy met Finance minister Nirmala Sitharaman in Delhi

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు శ్రీవారి ప్రసాదం అందజేశారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సేవలు ఉపయోగించుకున్నందుకు టీటీడీ చెల్లించాల్సిన రూ.23.78 కోట్ల జీఎస్టీ మొత్తాన్ని మాఫీ చేయాలని మంత్రిని కోరారు. జీఎస్టీ రద్దు వల్ల టీటీడీకి మరింత ఆర్థిక పరిపుష్టి ఏర్పడుతుందని, తద్వారా మరిన్ని సామాజిక, ధార్మిక కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు.

అంతేకాకుండా, హుండీ ద్వారా లభించిన రూ.1000, రూ.500 పాత నోట్ల మార్పిడి కోసం ఆర్బీఐకి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం 2016 నవంబరు 8న  అప్పటి పెద్ద నోట్లు రద్దు చేసిందని, కానీ ఆ తర్వాత కూడా భక్తులు పాత నోట్లను హుండీలో వేస్తూ వచ్చారని వివరించారు. అందుకే, ఆ నోట్లను ఆర్బీఐలో కానీ, మరే ఇతర బ్యాంకులోనైనా కానీ డిపాజిట్ చేసేందుకు అనుమతించాలని కోరారు. ఈ మేరకు తన భేటీ వివరాలను వైవీ సుబ్బారెడ్డి ట్విట్టర్ లో తెలియజేశారు.

More Telugu News