Palmyra Trees: పొట్టి తాటి చెట్లపై ఆసక్తి ప్రదర్శిస్తున్న తెలంగాణ సర్కారు

Telangana government shows interest on short Palmyra trees
  • తెలంగాణలో నీరా పానీయానికి విపరీతమైన డిమాండ్
  • బీహార్ నుంచి పొట్టి తాటిచెట్లు తెప్పిస్తున్న సర్కారు
  • 4 నుంచి ఐదేళ్లలో పెరిగే పొట్టి చెట్లు
తెలంగాణ రాష్ట్రంలో తాటి, ఈత, కొబ్బరి చెట్ల నుంచి తీసే నీరా పానీయానికి ఎంతో డిమాండ్ ఉంటుంది. అయితే నీరా ఉత్పత్తి పెంచేందుకు తెలంగాణ సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అధికంగా నీరా ద్రవాన్ని అందించే పొట్టి తాటి చెట్లను విరివిగా పెంచేందుకు నిర్ణయించింది. సాధారణంగా ఈ పొట్టిరకం తాటిచెట్లు బీహార్ లో అధికంగా ఉంటాయి. అందుకే బీహార్ నుంచి పొట్టి తాటిచెట్లను తీసుకువస్తున్నారు.

పొడుగు తాటిచెట్లు పూర్తిస్థాయిలో పెరిగేందుకు 10 నుంచి 14 ఏళ్ల సమయం పడుతుండగా, ఈ పొట్టిరకం మాత్రం 4 నుంచి 5 ఏళ్లలో పెరుగుతుంది. పొట్టి తాటిచెట్టు సీజన్ లో 3 నుంచి 15 లీటర్ల నీరా అందిస్తుంది. పైగా సీజన్ లో 100 తాటిపండ్లను కూడా ఇస్తుంది.

దీనిపై తెలంగాణ పామ్ ప్రమోటర్స్ సొసైటీ చైర్మన్ విష్ణుస్వరూప్ రెడ్డి మాట్లాడుతూ, గతేడాది 5 వేల పొట్టి తాటిచెట్లను తెప్పించామని, ఈ ఏడాది 1.25 లక్షలు తెప్పిస్తున్నామని చెప్పారు. కాగా, పొడవైన తాటిచెట్లను ఎక్కే సమయంలో కార్మికులు ప్రమాదాల బారినపడే అవకాశం ఉందని, పొట్టి తాటిచెట్లు అయితే అలాంటి ప్రమాదాలు జరగవని భావిస్తున్నారు.
Palmyra Trees
Telangana
Government
Neera
Bihar

More Telugu News