Rhea Chakraborty: హీరోయిన్ రియా చక్రవర్తికి బెయిల్ ఇవ్వలేను.. కారణం ఇదే: ముంబై కోర్టు జడ్జి

  • డ్రగ్స్ ట్రాఫికింగ్ లో రియా ఉంది
  • విచారణలో రియా కొందరి పేర్లను వెల్లడించింది
  • ఆమె బయటకు వెళ్తే.. అందరూ కలిసి సాక్ష్యాలను నాశనం చేస్తారు
Mumbai court tells the reason why it is denying bail to Rhea Chakraborty

హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఊహించని విధంగా ఇండస్ట్రీలో నెలకొన్న డ్రగ్స్ కల్చర్ తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి... చివరకు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది. ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో, ముంబై కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రియాకు బెయిల్ ఇవ్వకపోవడానికి గల కారణాలను వెల్లడించింది.

బెయిల్ మీద రియాను విడుదల చేస్తే... నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో ఆమె ఎవరి పేర్లను వెల్లడించిందో... వారందరినీ అలర్ట్ చేస్తుందని కోర్టు తెలిపింది. సాక్ష్యాలను నాశనం చేసే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ప్రాసిక్యూషన్ వారు తెలిపిన వివరాల ప్రకారం విచారణలో రియా కొందరి పేర్లను వెల్లడించిందని తెలిపింది. రియా బయటపెట్టిన వారిని విచారించే ప్రక్రియ కొనసాగుతోందని... ఈ నేపథ్యంలో రియా విడుదలైతే అందరూ కలిసి సాక్ష్యాలను నాశనం చేస్తారని చెప్పింది. సినీ ప్రముఖుల డ్రగ్స్ వ్యవహారంలో విచారణ ఇప్పుడు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో నిందితురాలికి తాను బెయిల్ ఇవ్వలేనని జడ్జి తెలిపారు.

విచారణ సందర్భంగా రియా తరపు లాయర్ వాదిస్తూ... ఆమె వద్ద కొంత మొత్తంలో గంజాయి మాత్రమే ఉందని... బెయిల్ పొందడానికి ఆమె అర్హురాలని వాదించారు. ఈ వాదనను జడ్జి ఖండించారు. ప్రాసిక్యూషన్ ఆరోపణల ప్రకారం డ్రగ్ ట్రాఫికింగ్ లో రియా ఉందని చెప్పారు. సుశాంత్ డ్రగ్స్ కు రియా డబ్బు చెల్లించిందని తెలిపారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం ప్రకారం ఇది నాన్ బెయిలబుల్ అని... సెక్షన్ 27-ఏ కింద ఆమె శిక్షార్హురాలని స్పష్టం చేశారు.

ఎన్డీపీఎస్ సెక్షన్ 27-ఏ కింద ఎవరైనా ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కానీ డ్రగ్స్ ఫైనాన్సింగ్ లో ఉన్నట్టైతే వారికి 10 నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఇదే సమయంలో రూ. 2 లక్షల వరకు జరిమానా విధిస్తారు.

More Telugu News