Kangana Ranaut: రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ బీఎంసీపై కోర్టును ఆశ్రయించిన కంగనా

Kangana amends her petition seeking two crores from BMC
  • ముంబయిలో కంగనా కార్యాలయం కూల్చివేత
  • కూల్చివేత సమయంలోనే హైకోర్టులో కంగనా పిటిషన్
  • ఇప్పుడదే పిటిషన్ కు సవరణ
మహారాష్ట్ర సర్కారుతో అమీతుమీకి సై అంటున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ముంబయిలో తన కార్యాలయం కూల్చివేసిన బీఎంసీ (బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్)పై మరోసారి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన కార్యాలయాన్ని కూల్చివేస్తున్నప్పుడే దాన్ని అడ్డుకునేందుకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కంగనా, ఇప్పుడు ఆ పిటిషన్ కు సవరణ కోరారు. కూల్చివేత ఘటనకు పాల్పడిన బీఎంసీని రూ.2 కోట్లు పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ తన పిటిషన్ లో సవరణ చేస్తున్నట్టు కంగనా హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.

బాంద్రాలోని పాలి హిల్ బంగ్లా నెంబర్ 5ను అక్రమంగా కూల్చివేశారని, బంగ్లాలో 40 శాతం భాగం ధ్వంసమైపోయిందని సవరించిన తన పిటిషన్ లో పేర్కొన్నారు. విలువైన షాండ్లియర్ లు, సోఫా సెట్లు, అరుదైన కళాఖండాలు కూడా ధ్వంసమయ్యాయని వివరించారు. సవరించిన పిటిషన్ ను అంగీకరించిన బాంబే హైకోర్టు వచ్చే వారం విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది. తాము కూల్చివేసిన భాగం అక్రమ నిర్మాణమేనని నిరూపించలేకపోతే బీఎంసీ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం, ఆ తర్వాత పరిణామాలు ఓ రణరంగాన్ని తలపిస్తున్నాయి. బాలీవుడ్ లో బంధుప్రీతి అంటూ ఆరోపణలు చేసిన కంగనా, ఆపై రాజకీయ దుమారంలో చిక్కుకుంది. ముంబయిని పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పోల్చుతూ వ్యాఖ్యలు చేయడంతో అధికార శివసేన భగ్గుమంది.

ముంబయి పోలీసులపైనా, ఇక్కడి ప్రభుత్వంపై నమ్మకం లేకపోతే ముంబయిలో అడుగుపెట్టవద్దంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేయగా, ముంబయిలో అడుగుపెట్టనివ్వకుండా నన్నెవరు అడ్డుకోగలరు అంటూ కంగనా చాలెంజ్ చేసింది. ఈ క్రమంలో ఆమె చండీగఢ్ నుంచి ముంబయి రాగా, అక్రమ నిర్మాణం అంటూ కంగనా కార్యాలయాన్ని మహా సర్కారు కూల్చివేసింది.
Kangana Ranaut
BMC
Petition
Bombay High Court
Mumbai

More Telugu News