Manda Krishna: పైసల్లేవంటూనే సెక్రటేరియట్ ఎలా కడుతున్నారు?: మంద కృష్ణ

Manda Krishna fires on CM KCR over land issues
  • దళితులకు భూమి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారన్న మంద కృష్ణ
  • ఇప్పుడు దళితుల నుంచే భూములు లాక్కుంటున్నారని ఆరోపణ
  • తట్టుకోలేక దళితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వెల్లడి
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ తెలంగాణ సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్ ఇప్పుడు డబ్బుల్లేవంటున్నారని, డబ్బు లేకుండా సెక్రటేరియట్ ఎలా కడుతున్నారని మంద కృష్ణ ప్రశ్నించారు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యయంలో దళితులు, బహుజనులే త్యాగం చేశారని, కానీ దొరల రాజ్యంలో దళితుల బతుకులు ఛిద్రమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అభివృద్ధి కార్యక్రమాల పేరిట దళితుల భూములు లాగేసుకుంటున్నారని, శ్మశానవాటికలు, ప్రకృతి వనాలు, రైతు వేదికలు అంటూ భూములు లాక్కుంటుంటే తట్టుకోలేక దళితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. గట్టిగా ప్రశ్నించినవారిపై పీడీ యాక్ట్ లు, కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.

మంద కృష్ణ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. 'మా భూములు మాకు కావాలి' పేరిట ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నిర్వహించిన దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని, మహాజన సోషలిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. తాము అధికారం చేపట్టాక దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని, లేక, ఎకరాకు రూ.10 లక్షల చొప్పున రూ.30 లక్షలు వారి అకౌంట్లో వేస్తామని హామీ ఇచ్చారు.
Manda Krishna
KCR
Secretariat
Telangana
Dalits
MRPS

More Telugu News