Chandrababu: ఏపీలో నిలిచిపోయిన ప్రాజెక్టులు చూస్తే మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆత్మ ఘోషిస్తుంది: చంద్రబాబు

Chandrabau tributes to Engineering legend Mokshagundam Visweswaraiah
  • నేడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి
  • నివాళులు అర్పించిన చంద్రబాబు
  • ఇంజినీరింగ్ నిపుణుల రుణం తీర్చలేనిదంటూ ట్వీట్
  • టీడీపీ ప్రభుత్వానికి ఎంతో పేరుతెచ్చారని కితాబు
ఇవాళ ఇంజినీరింగ్ రంగ దిగ్గజం మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ లో నివాళులు అర్పించారు. ఇంజినీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని జాతీయ ఇంజినీర్స్ డేగా జరుపుకుంటున్న సందర్భంగా నవభారత నిర్మాణం కోసం కృషి చేస్తోన్న ఇంజినీరింగ్ నిపుణులందరికీ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.

హైదరాబాదులోని హైటెక్ సిటీ, సైబర్ సిటీ నిర్మాణాల నుంచి ఏపీలోని అమరావతి గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీ, నదుల అనుసంధాన ప్రాజెక్టు, పట్టిసీమ, ఆంధ్రుల జీవనాడి పోలవరం, క్లిష్టమైన కనకదుర్గ ఫ్లైఓవర్ వరకు టీడీపీ హయాంలో ఎన్నో నిర్మాణాలు జరిగాయని తెలిపారు. టీడీపీ ప్రభుత్వానికి పేరు తెచ్చిన ఇలాంటి ఎన్నో నిర్మాణాలకు తమ ప్రతిభను అందించిన ఇంజినీరింగ్ నిపుణుల రుణం తీర్చలేనిది అని కొనియాడారు.

అలాంటిది, ఏపీలో వైసీపీ వచ్చాక నిలిచిపోయిన ప్రాజెక్టులను చూస్తే మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆత్మ ఘోషిస్తుందా అనిపిస్తోందని పేర్కొన్నారు. ఎందుకంటే, కక్షతో ప్రాజెక్టులు ఆపేసి ఇంజినీర్ల, కార్మికుల ఉపాధి పోగొట్టడం ఇంజినీరింగ్ ద్రోహమని విమర్శించారు. ఇప్పటికైనా పాలకులు టీడీపీ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, రోడ్లు, భవనాలు, పేదల ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.
Chandrababu
Mokshagundam Visweswaraiah
Engineers Day

More Telugu News