IMD: బలపడిన అల్పపీడనం... రెండు రోజులు భారీ వర్షాలు!

  • రెండు రోజుల క్రితం ఏర్పడ్డ అల్పపీడనం
  • తీరం వెంబడి గాలులకు అవకాశం
  • మత్స్యకారులు వెళ్లవద్దని హెచ్చరికలు
Rain Allert for Telugu States

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడింది. ఇదే సమయంలో మధ్యప్రదేశ్ నుంచి చత్తీస్ గఢ్, తెలంగాణ మీదుగా ఒడిశా వరకూ ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతూ ఉండటంతో, తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది.

చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు చాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. సముద్రం అల్ల కల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. కోస్తా తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వరకూ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు.

కాగా, గడచిన 24 గంటల్లో తెలంగాణలోని హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం తదితర జిల్లాలతో పాటు ఏపీలోని ఉభయ గోదావరి, కృష్ణా, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. ఓ వైపు నదులన్నీ ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఉన్న నేపథ్యంలో మరిన్ని వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

More Telugu News