Abraham Lincoln: అమెరికా మాజీ అధ్యక్షుడు లింకన్ వెంట్రుకలు, రక్తపు మరకల టెలిగ్రామ్ వేలం.. రూ. 60 లక్షలకు సొంతం!

  • జాన్‌లిక్స్ బూత్ చేతిలో హత్యకు గురైన లింకన్
  • పోస్టుమార్టం సందర్భంగా వెంట్రుకలు కట్ చేసి, భద్రపరిచిన వైనం
  • 1999లో వాటికి తొలిసారి వేలం
Lock of Abraham Lincolns hair along with telegram auctioned

అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌కు చెందిన తలవెంట్రుకలు, రక్తపు మరకలతో తడిసిన టెలిగ్రామ్‌ను ఓ వ్యక్తి వేలంలో రూ. 60 లక్షల రూపాయల (81 వేల డాలర్లు)కు సొంతం చేసుకున్నాడు. జాన్ లిక్స్ బూత్ అనే వ్యక్తి చేతిలో 1865లో లింకన్ హత్యకు గురయ్యారు.

ఆ తర్వాత ఆయన భౌతిక కాయానికి నిర్వహించిన పోస్టుమార్టం సందర్భంగా ఐదు సెంటీమీటర్ల పొడవున్న ఆయన తల వెంట్రుకలు కొన్నింటిని కత్తిరించి, ల్యాబ్ పరీక్షల అనంతరం వాటిని లింకన్ బంధువు డాక్టర్ లిమన్ బీచర్ టోడ్ అనే వ్యక్తికి ఇచ్చారు. ఆయన వాటిని తన జేబులో వున్న ఓ టెలిగ్రాం పేపర్లో చుట్టి భద్రపరిచారు. అప్పటి నుంచి అవి లింకన్ కుటుంబ సభ్యుల వద్ద భద్రంగా ఉన్నాయి.

ఇక, లింకన్ వెంట్రుకలను 1999లో తొలిసారి వేలం వేశారు. తాజాగా, శనివారం ఆర్ఆర్ ఆక్షన్ ఆఫ్ బోస్టన్ అనే సంస్థ వీటికి మరోమారు వేలం నిర్వహించగా ఓ వ్యక్తి 81 వేల డాలర్లకు కొనుగోలు చేశారు. వాటిని సొంతం చేసుకున్న వ్యక్తి పేరును రహస్యంగా ఉంచారు.

More Telugu News