Agra: మన హీరోలు మొఘలాయిలు ఎందుకు అవుతారు?: యూపీ సీఎం యోగి కీలక వ్యాఖ్యలు

  • ఆగ్రాలో నిర్మితమవుతున్న మొఘల్ మ్యూజియం
  • పేరును ఛత్రపతి శివాజీ పేరిట మార్చిన యూపీ సీఎం
  • ఇప్పటికే పలు ప్రాంతాల పేర్లు మార్చిన ఆదిత్యనాథ్
Moghals is not our Heros says Yogi Adityanath

ఉత్తరప్రదేశ్ లోని చారిత్రక పర్యాటక కేంద్రం ఆగ్రాలో నిర్మితమవుతున్న మొఘల్ మ్యూజియం పేరును ఛత్రపతి శివాజీ మహరాజ్ మ్యూజియంగా మారుస్తున్నట్టు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన ఆయన, రాష్ట్రంలో బానిస మనస్తత్వాలకు చెందిన ఏ ఒక్క గుర్తును, సూచికను ఉంచబోమని స్పష్టం చేశారు. మొఘలాయిలను మన హీరోలుగా ఎందుకు ఉండనిస్తామని ప్రశ్నించారు. శివాజీ మహరాజ్ మనకు హీరో అని అభివర్ణించారు.

కాగా, తన మూడేళ్ల పాలనలో యోగి పలు ప్రాంతాల పేర్లను మార్చారన్న సంగతి తెలిసిందే. అలహాబాద్ పేరును ఆయన ప్రయాగ్ రాజ్ గా మార్చారు. 2015లో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టును చేపట్టారు. తాజ్ మహల్ కు సమీపంలో ఆరు ఎకరాల స్థలంలో ఈ మ్యూజియంను, ప్రభుత్వం నిర్మించతల పెట్టింది. ఈ మ్యూజియంలో మొఘలుల సంస్కృతిని, వారి విలువైన వస్తువులు, చిత్రాలు, కళాఖండాలు, దుస్తులు, పాత్రలు, ఆయుధాలు తదితరాలను ప్రదర్శించాలన్నది ప్రభుత్వ నిర్ణయం.

భారతావనిని మొఘలులు 1526 నుంచి 1857 వరకూ పాలించిన సంగతి తెలిసిందే. వారి పాలనలోనే ఆగ్రా, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఎన్నో భారీ నిర్మాణాలు జరిగాయి. ఎర్ర కోట, తాజ్ మహల్ వంటివి ఆ కోవలోనివే. అయితే, తమ మూడు శతాబ్దాల పాలనలో మొఘలులు హిందువులు లక్ష్యంగా దాడులు చేశారని, ఇబ్బందులు పెట్టారన్న ఆరోపణలపై చరిత్రకారులు విభిన్న వాదనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News