Corona Virus: ఢిల్లీలో పాజిటివ్, జైపూర్ లో నెగటివ్... తల పట్టుకున్న బీజేపీ ఎంపీ!

  • రాజస్థాన్ కు చెందిన ఎంపీ హనుమాన్ బెనీవాల్ 
  • పరస్పర విరుద్ధ కరోనా రిపోర్టులు
  • ట్విట్టర్ లో రెండు రిపోర్టులు పెట్టిన బెనీవాల్
MPs Report Positive in Delhi and Negative in Jaipur

పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఎంపీలందరికీ కరోనా పరీక్షలు చేయగా, దాదాపు 25 మందికి పైగా ఎంపీలకు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. వీరందరినీ క్వారంటైన్ లో ఉండాలని, పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావద్దని ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. అయితే, రాజస్థాన్ కు చెందిన ఓ ఎంపీ మాత్రం తన పరిస్థితితో అయోమయంలో పడ్డారు.

ఇంతకీ విషయం ఏంటంటే లోక్ సభ సభ్యుడు హనుమాన్ బెనీవాల్ కు ఢిల్లీలో పరీక్షలు చేయగా, కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన సభకు హాజరు కాకుండా, స్వరాష్ట్రానికి చేరుకుని, జైపూర్ లో మరోసారి పరీక్ష చేయించుకోగా, నెగటివ్ వచ్చింది. తాను వ్యాధి బారిన పడలేదని ట్విట్టర్ ద్వారా పేర్కొన్న ఆయన, ఆ రిపోర్టు కాపీలను కూడా పోస్ట్ చేశారు. ఈ రెండింటిలో దేన్ని నమ్మాలో, దేన్ని నమ్మకూడదో తనకు అర్థం కావడం లేదని, తాను అయోమయంలో పడిపోయానని అన్నారు.

ఇక ఆయన ట్వీట్ ను చూసిన నెటిజన్లు, ఇప్పటివరకూ సామాన్యులకు మాత్రమే ఇటువంటి తిప్పలు పరిమితం అయ్యాయని, ఇప్పుడు ఓ ఎంపీకి కూడా ఇదే పరిస్థితి ఎదురైందని కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఈ నెల 11న హనుమాన్ బెనీవాల్ ఇచ్చిన నమూనాలను పరిశీలించిన వైద్యులు 12న పాజిటివ్ అని ఇచ్చారు. ఇది ఐసీఎంఆర్ చేసిన పరీక్ష. ఆపై 13వ తేదీన ఆయన జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రిలో ఇచ్చిన నమూనా ఫలితం నెగటివ్ గా రావడం గమనార్హం.

More Telugu News